BJP | సిద్దిపేట, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయీమొద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, మహిళా మోర్ఛా అధ్యక్షురాలు ఫర్జానా బేగం, నాయకులు యాసిన్ హుస్సేన్ తదితరులు 60 మందికిపైగా బీజేపీకి రాజీనామా చేశారు. వీరంతా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అంటే గంగా జమున తెహజీబ్లా సీఎం కేసీఆర్ నిలిపారని అన్నారు.
మత కలహాలు లేకుండా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని కాపాడుతున్నారని తెలిపారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే మైనార్టీలు భద్రంగా ఉన్నారని అన్నారు. దసరా, బతుకమ్మ పండుగ సమయంలో హిందువులకు చీరెలు, రంజాన్ మాసంలో ముస్ల్లింలకు తోఫా, క్రిస్మస్ సమయంలో క్రిస్టియన్లకు కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని చెప్పారు. దేశంలో మైనార్టీల విద్య కోసం ఎంత ఖర్చు చేస్తారో, వారి కోసం ఎన్ని సూళ్లు ఉన్నాయో ఒక తెలంగాణలోనే అన్ని ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ముస్లింల కోసం అజ్మీర్ దర్గాలో తెలంగాణ హౌస్ కట్టిస్తున్నట్టు తెలిపారు.