హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టబోతున్న మూడో బడ్జెట్ (2026-27)పై సబ్బండ వర్ణాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. కానీ, గత రెండు బడ్జెట్ల ట్రాక్ రికార్డ్ మాత్రం అందరినీ భయపెడుతున్నది. ఏటా బడ్జెట్లో లక్షల కోట్ల రూపాయల కేటాయింపులు చూపుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్.. వాస్తవ వ్యయం దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నది. ప్రతిపాదించిన బడ్జెట్‌కు, ఆ ఏడాది చివరన సవరించిన అంచనాలకు మధ్య 20 నుంచి 25% మేరకు వ్యత్యాసం ఉంటున్నది. బడ్జెట్లో రూ.100 కేటాయిస్తే.. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నది రూ.75 మాత్రమే. మిగిలిన రూ.25 ఎటు పోతున్నదో? ప్రభుత్వం ఏ పథకానికి ఎంత కోత పడుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో తొలి బడ్జెట్‌ను రూ.2.91 లక్షల కోట్లతో ప్రతిపాదించింది. కానీ, అందులో వాస్తవంగా ఖర్చు చేసింది 75 నుంచి 80% మాత్రమే. అంటే బడ్జెట్ కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.72 వేల కోట్లు ఖర్చు కాలేదు. సవరించిన అంచనాల ప్రకారం కొన్ని కీలక రంగాల్లో వ్యయం భారీగా తగ్గింది. ముఖ్యంగా గృహనిర్మాణ రంగానికి దాదాపు 83%, వ్యవసాయ రంగానికి 20% వరకు నిధుల కోత పెట్టింది. పట్టణాభివృద్ధికి అంచనా కంటే 19% తకువగా నిధులు వెచ్చించింది. కేంద్రం నుంచి గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ రూపంలో వసాయనుకున్న నిధుల్లో 36.5% మాత్రమే రావడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ‘అభయ హస్తం’ పేరిట రాష్ట్ర ప్రజలకు 6 ప్రధాన గ్యారెంటీలతోపాటు సమాజంలోని వివిధ వర్గాలకు 420 హామీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోగా వీటిని అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ సైతం ఊదరగొట్టారు. కానీ, కాంగ్రెస్ అధికారం చేపట్టి 800 రోజులు దాటినా ఆ గ్యారెంటీలు, 420 హామీలపై గత రెండు బడ్జెట్లలో స్పష్టత ఇవ్వని రేవంత్‌రెడ్డి సర్కార్.. శుక్రవారం ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నది. ఈ బడ్జెట్ లోనైనా 6 గ్యారెంటీలు, 420 హామీల అమలుకు నిధులు కేటాయిస్తారా? లేక మళ్లీ దాటవేస్తారా? అన్నది ప్రశ్నార్థకమే.
ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారం చేపట్టాక వాటి ఊసే ఎత్తడం లేదు. నిరుపేద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని, చదువుకొనే యువతులకు స్కూటీలు పంపిణీ చేస్తామని, పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మీ పథకం కింద రూ.1,01,116 నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని నమ్మించి మోసగించింది. రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందజేస్తామని, వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్. ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పి గొంతు కోసింది. కళాశాల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం విద్యార్థులకు రూ.5 లక్షల వరకు భరోసా కార్డులు ఇస్తామని, వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పేషెంట్లు, ఒంటరి మహిళలకు ఇచ్చే నెలవారీ పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని, ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అర్హులైన నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.4 వేల భృతి ఇస్తామని నయవంచన చేసింది. దీంతో రైతు భరోసా, మహిళలకు రూ.2,500 సాయం, ఆసరా పింఛన్ల పెంపు లాంటి ప్రధాన హామీల అమలుకు ఈసారి బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారా? అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
