హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణతో రాజకీయ వికృత క్రీడలు ఆడటానికి బీజేపీ నిర్ణయించుకున్నదా? ఓవైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ, థర్డ్‌వేవ్ హడలగొడుతుంటే.. తెలంగాణలో రాజకీయ పర్యటనలు జరుపాలని బీజేపీ ఎందుకు భావిస్తున్నది? బండి సంజయ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని.. మొన్న నడ్డా వచ్చిపోయినట్లుగా.. రానున్న రోజుల్లో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్‌సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంతబిశ్వశర్మ వస్తారని, భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. అంటే, తెలంగాణ ప్రజలు ప్రాణాలు ప్రాణాలు కావా? మీ రాజకీయ విన్యాసాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కరోనాను వ్యాపింపజేస్తారా? అని తెలంగాణ వాసులు నిలదీస్తున్నారు.
ఇదే బీజేపీ నేతలు యూపీ తదితర రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఏకంగా ఎన్నికల సభలను, ప్రచారాన్నే వాయిదా వేసుకుంటున్నారు. లక్నోలో ఆదివారం తలపెట్టిన ప్రధాని మోదీ భారీ బహిరంగసభను బీజేపీ రద్దు చేసుకుంది. గురువారం నోయిడాలో యోగి ఆదిత్యనాథ్ జరుపాలనుకున్న బహిరంగసభను వాయిదా వేశారు. ప్రత్యక్ష సభలకు బదులుగా వర్చువల్ ప్రచారకార్యక్రమాలను నిర్వహిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. యూపీలోనే కాదు.. ఇతర రాష్ర్టాల్లోనూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9, 10 తేదీల్లో పర్యటించాలనుకున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. రాజస్థాన్‌లో ఈ నెల రెండోవారంలో జరుగాల్సిన ఆయన పర్యటన కూడా వాయిదా పడింది. అంటే, దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఒక రకంగా వ్యవహరిస్తే.. తెలంగాణలో మరోవిధంగా వ్యవహరిస్తారా బీజేపీ నేతలు? ఇక్కడ మీ కార్యక్రమాలతో జనంలో కరోనా ప్రబలితే.. కరోనాను తెలంగాణ సర్కార్ నియంత్రలేకపోయిందని దానిపైన కూడా రాజకీయాలు చేద్దామని అనుకుంటున్నారా? బీజేపీకి ఇవి సగటు తెలంగాణ వాసి ప్రశ్నలు.