MLA Maheshwar Reddy | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : మాజీ ప్రధాని మరణించిన నేపథ్యంలో దేశం సంతాప దినాలను పాటిస్తుండగా.. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాంకు వెళ్లడమేంటని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రశ్నించారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఒక ఆర్డినెన్స్‌ను చింపివేసి రాహుల్‌గాంధీ ఆయన అవమానించారని గుర్తుచేశారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారంరోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించిందని, ఈ సమయంలో రాహుల్‌గాంధీ న్యూ ఇయర్ జరుపుకొనేందుకు వియత్నాం వెళ్లినట్టు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. మహేశ్వర్‌రెడ్డిని మధ్యలోనే అడ్డుకున్న మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇది సంతాపం తెలిపేందుకు ఏర్పాటుచేసిన సమావేశమని, రాజకీయాలు మాట్లాడటం సబబుకాదని సూచించారు. రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన ధర్మం సభ్యులపై ఉందనిన్నారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఏలేటి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
అయినా వెనక్కి తగ్గని మహేశ్వర్‌రెడ్డి.. మన్మోహన్‌సింగ్‌కు సంతాపం తెలుపుతూనే ఆయనకు జరిగిన అవమానాలను గుర్తు చేస్తున్నానని అన్నారు. ఈ సారి మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుతగులుతూ.. నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సైతం ఇలా మాట్లాడరని, మధ్యలో పార్టీలో చేరిన వారు ఇలా మాట్లాడటం సబబుకాదని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ విహారయాత్రకు వెళితే ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టి విమర్శించండి అని సూచించారు. దీనిపై ఏలేటి మళ్లీ మట్లాడుతూ.. ‘భక్తి శివుడి మీద.. భక్తి చెప్పుల మీద అన్నట్టు దేశమంతా మన్మోహన్సింగ్ మృతిపట్ల సంతాపం తెలుపుతుంటే.. దేశం వదిలి వియత్నా వెళ్లడం కరెక్టెనా..? మన్మోహన్‌సింగ్‌పై ప్రేమ ఏపాటిదో దానికి ఇదే నిదర్శనం’ అని అన్నారు.
అందరు ప్రధానులకు దక్కిన గౌరవం మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ అయిన పీవీ నర్సింహారావు దక్కలేదని మహేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మరణానంతరం పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో పీవీ స్మారక చిహ్నం నిర్మాణానికి స్థలం కేటాయించలేదని కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన చేయలేదని విమర్శలు చేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత పీవీకి భారతరత్న ఇచ్చామని, పురస్కార ప్రదానోత్సవానికి సోనియాగాంధీ సహా వారి కుటుంబం హాజరుకాలేదని విమర్శించారు. పీవీపై సోనియా కుటుంబసభ్యులు కక్ష పెట్టుకున్నారనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు.