హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): చీకటి ఒప్పందాలు, చీకటి జీవోలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమృత్ పథకం కింద రూ.3 వేల కోట్ల పనుల్లో భారీ కుంభకోణం జరిగిందని, ఈ పనులను మూడు భాగాలుగా విభజించి ఒక్కొక్కరికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఇచ్చారని ఆరోపించారు. ఎక్సైజ్ కుంభకోణంలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌కు చెందిన శోధ కంపెనీకి రూ.400 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని, దానికి అర్హత లేకపోవడంతో ఏఎంఆర్‌తో జాయింట్ వెంచర్‌గా జత కట్టారని తెలిపారు.
కేఎన్ఆర్ అనే కంపెనీకి మరో కాంట్రాక్ట్ ఇచ్చారని, సీఎం తమ్ముడు తిరుపతిరెడ్డి ఇందులో భాగస్వామి అని చెప్తున్నారని పేర్కొన్నారు. మేఘా కంపెనీకి రూ.1100 కోట్ల కాంట్రాక్ట్ దక్కిందని చెప్పారు. ఇవి గ్లోబల్ టెండర్లు కావని, సంబంధిత టెండర్లు ఆన్లైన్లో కనిపించవని, ఏ జీవో కూడా పబ్లిక్ డొమైన్లో లేదని వివరించారు. రూ.600 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్‌ను రూ.1000 కోట్లకు ఇచ్చినట్టు ఆరోపించారు. 30 నుంచి 35 శాతం తకువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దీనిని బట్టి దాదాపు రూ.1200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
మేఘా కృష్ణారెడ్డి మీద కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలో కొత్త టెండర్లు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. వీటిపై రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్‌ను కుటుంబ పాలన అంటూ విమర్శించిన రేవంత్ ఇప్పుడు తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. రేవంత్ ఏడు నెలల పాలనలోని చీకటి జీవోలపై ఈడీ, సీబీఐలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.