హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అనేది నానుడి. తాజాగా ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయంలో నిరూపితమైంది. కొడుకు ‘కళలు’.. బండి రాజకీయ భవిష్యత్తుకు బీటలు వేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకొని తన రాజకీయ భవిష్యత్తును తానే ప్రమాదంలోకి నెట్టుకున్నారనే చర్చ నడుస్తున్నది. ఈ కేసులో ఆయన చేసిన అతే ఆయనకు శాపంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొడుకుపై నమోదైన పోక్సో కేసు ఆయన రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతుందనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజులు రాజకీయంగా ‘బండి’కి కష్టకాలమేననే చర్చ నడుస్తున్నది. పోక్సో కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడం, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉండటంతో బీజేపీ అధిష్ఠానం సైతం ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టిందని, కొద్దిరోజుల్లోనే కేంద్ర సహాయ మంత్రి భవితవ్యంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జోరుగా సాగుతున్నది.
ఇప్పటికే ఆయనకు పదవీగండం పొంచి ఉన్నదని, భవిష్యత్తులో అంతకుమించి జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో దుందుడుకుతనం కంటే సహనం ఎక్కువ అవసరమని చెప్తుంటారు. కానీ, ముందూ వెనుక, మంచీ చెడు, చిన్నాపెద్ద అనే వివేచన, గౌరవం లేకుండా ఇన్నాళ్లూ తన నోటి దురుసుతో పలువురు రాజకీయ నేతలపై టార్గెట్గా మాట్లాడిన ఆయన నోరే ఇప్పుడు మూతపడే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేంద్ర సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ కర్మ ఎవరినీ వదిలిపెట్టదని సోషల్ మీడియాలో నెటిజన్లు చురకలేస్తున్నారు.
తప్పు మీద తప్పు
కేంద్ర సహాయ మంత్రి తనకు తానే ఈ ఊబిలో కూరుకుపోయారనే అభిప్రాయాలున్నాయి. తప్పు మీద తప్పు చేస్తూ కొడుకును మరింత ఇరకాటంలో పడేయడంతోపాటు తన రాజకీయ భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. స్వయంగా ఒక కేంద్ర సహాయమంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇలాంటి సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన కేంద్రమంత్రి అధికార బలం ప్రదర్శించే ప్రయత్నం చేశారనే విమర్శలున్నాయి. తాను కేంద్ర సహాయ మంత్రిననే గర్వం, రాష్ట్రంలో ‘ముఖ్యనేత’ తనకు అండగా ఉన్నారన్న ధీమాతో తప్పు మీద తప్పు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పలుకుబడి, అధికార దర్పంతో బాధితురాలిని, ఆమె కుటుంబసభ్యులను బెదిరించడం ఆయన చేసిన పెద్ద తప్పుగా చెప్తున్నారు. ఆ తర్వాత పోక్సో కేసు నమోదైన వెంటనే కొడుకును పోలీసులకు అప్పగించకుండా మరో తప్పు చేశారనే అభిప్రాయాలున్నాయి. కులం, మతం కార్డులు వాడటం, ప్రత్యర్థులపై బెదిరింపులకు దిగడం మరింత మైనస్ అయ్యిందనే అభిప్రాయాలున్నాయి.
దాదాపు వారం రోజులుగా కొడుకును దాచిపెట్టారనే ఆరోపణలు ఆయనకు మరింత చెడు చేశాయి. ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు కనిపించడంలేదంటే ఎలా? అనే ప్రశ్నలు చర్చకు వచ్చాయి. కేంద్రమంత్రిగా ఉంటూ నిందితుడిని కాపాడటం ఏమిటనే ప్రశ్నలు కూడా వ్యక్తమయ్యాయి. బాధితులపై సోషల్మీడియా వేదికగా రివర్స్ అటాక్ చేయించడం, వారిని మరింత ఇబ్బంది పెట్టేలా పోస్టింగ్లు పెట్టడం, హనీట్రాప్ అంటూ బాధితురాలినే నిందితురాలిగా ప్రచారం చేయడం మరింత చేటు కలిగించిందనే అభిప్రాయాలున్నాయి. చివరిక్షణంలోనూ చేసిన చేష్టలు ఆయనకు మరింత నష్టం చేశాయనే అభిప్రాయాలున్నాయి. ఒకవైపు, పోలీసులు నిందితుడిని నార్సింగి వద్ద అదుపులోకి తీసుకున్నామని ప్రకటిస్తే.. కేంద్ర సహాయ మంత్రి మాత్రం తానే తన కొడుకునే పోలీసులకు అప్పగించానని ప్రకటించుకున్నారు. తద్వారా తన పరువు తానే తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఒకటి తర్వాత మరొకటిగా తప్పులపై తప్పులు చేస్తూ కేసును జఠిలం చేయడంతోపాటు తన కొడుకు భవిష్యత్తుతోపాటు తన రాజకీయ భవిష్యత్తును సైతం ప్రమాదంలోకి నెట్టుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
బెడిసికొట్టిన ప్రయత్నాలు! హ్యాండ్ ఇచ్చిన ‘ముఖ్యనేత’!
తన కొడుకుపై పోక్సో కేసు నమోదు కాకుండా చేసేందుకు, కేసు నమోదైన తర్వాత అది ప్రచారం కాకుండా చేసేందుకు, తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకొనేందుకు కేంద్ర సహాయమంత్రి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయనే చర్చ జరుగుతున్నది. తన పలుకుబడి, ఆర్థిక ఒప్పందంతో ఈ అంశాన్ని ఫోకస్ చేయకుండా రాష్ట్రంలోని ఒక వర్గం మీడియాను మేనేజ్ చేశారనే ఆరోపణలున్నాయి. అయితే, రాష్ట్రంలోని అనుకూల మీడియా పట్టించుకోకపోయినా.. నేషనల్ మీడియా మాత్రం తన పని తాను చేసిందనే అభిప్రాయాలున్నాయి. అందరినీ అన్ని వేళల్లో మేనేజ్ చేయడం సాధ్యం కాదనే సంగతి మర్చిపోయిన కేంద్ర మంత్రి అడ్డంగా బుక్కాయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్పై లైంగిక దాడి కేసులో తన కొడుకును కాపాడుకొనేందుకు, తన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకొనేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయనే చర్చ జరుగుతున్నది.
అయితే, రాష్ట్రంలో ‘ముఖ్యనేత’ తొలి నుంచి ఒక దశ వరకు అండగా నిలిచారని, ఆయన అండ చూసుకొనే కేంద్ర సహాయ మంత్రి రెచ్చిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ముఖ్యనేత’ సలహాలతోనే తప్పటడుగులు వేశారనే చర్చ కూడా జరుగుతున్నది. అయితే, ఒక దశలో ఈ కేసు వ్యవహారం ‘ముఖ్యనేత’ మెడకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు తాత్సారానికి ‘ముఖ్యనేత’ కారణమనే చర్చ జోరుగా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పక్కకు తప్పుకోవడమే మేలని భావించారో ఏమో గానీ ‘ముఖ్యనేత’ చివరికి బండికి హ్యాండ్ ఇచ్చారనే చర్చ జరుగుతున్నది. ‘కొడుకును అప్పగించాలి’ అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో బండి దిక్కుతోచని స్థితిలో పడిపోయారని తెలిసింది. దీనికితోడు ఆరెస్సెస్ ముఖ్యులు కొంతమంది చెప్పిన మాటలను సైతం బండి పెడచెవిన పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇలా అన్నివైపుల ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఇక మరో మార్గంలేక కొడుకును బయటకు తీసుకొనిరావాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.