సిరిసిల్ల టౌన్, నవంబర్ 13: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై బీజేపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని సర్దిచెప్తుండగా అత్యుత్సాహం ప్రదర్శించి నెట్టివేశారు. పీఎం మోదీని విమర్శించాడని ఆరోపిస్తూ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేసేందుకు బీజేపీ నాయకులు పూనుకున్నారు. పోలీసులు అక్కడికివెళ్లి అడ్డుకోగా కొందరు బీజేపీ నాయకులు గాంధీ చౌరస్తాలో దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో సీఐ అనిల్‌కుమార్ అక్కడికి చేరుకొని బీజేపీ నేతలను సముదాయించారు. ఈ క్రమంలో కొంతమంది బీజేపీ నాయకులు రెచ్చిపోయి పోలీసులను నెట్టివేశారు. పోలీసులతో ఎలా వ్యవహరించాలో తెలియదా?, విధుల్లో ఉన్న పోలీసులను నెట్టివేస్తారా? అంటూ అక్కడే ఉన్న సీఐ వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.