సిరిసిల్ల గాంధీచౌక్, ఏప్రిల్ 1: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు మద్యం సీసాలతో మాల వేసి అవమానపరిచిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.ముస్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవా రం బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్‌రెడ్డితోపాటు కార్యకర్త కల్యాణ్ మరి కొంతమంది కలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాటికి మద్యం సీసాల దండను వేసి అవమానపరిచారని ముస్తాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో శనివారం నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా బీజేపీ కార్యకర్తలు కోర్టు ఆవరణలో అడ్డుపడి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు బలగాలు చేరుకొని కార్యకర్తలను శాంతింపజేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట నిందితులను హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.