ఖమ్మం, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అయోధ్య రాముడిపై అమితమైన ప్రే మను చూపించే కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న శ్రీసీతారామచంద్రస్వామి భూముల అన్యాకాంత్రంపై మాత్రం పెదవి విప్పడం లేదు. తెలంగాణ సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ భద్రాద్రి రామయ్య కు కష్టాలు తప్పడం లేదు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామికి ఏపీలోని ఎటపాక, పురుషోత్తపట్నంలో భూములున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతమవుతున్నాయంటూ దేవస్థానం ఎనిమిదేండ్లుగా పోరాటం చేస్తున్నా ఏపీ ప్రభుత్వం నుంచి మద్దతు లభించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఐదు మండలాలను కేంద్ర ప్రభుత్వం ఏపీలో విలీనం చేసింది. ఇందులో భద్రాచలం మండలంలోని కన్నాయిగూడెం, ఇసుకలపాడు, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు కూడా ఉన్నాయి. పురుషోత్తపట్నంలో భద్రా ద్రి రామయ్యకు చెందిన 885 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీని కౌలు ద్వారా భద్రాచలం దేవస్థానానికి ఏటా రూ. 30 లక్షల ఆదాయం సమకూరుతున్నది. 2014 నుంచి 2017 వరకూ కౌలు సక్రమంగా వ చ్చింది. ఆ తరువాత నుంచి పురుషోత్తపట్నం భూములు అన్యాక్రాంతమవుతూ వస్తున్నాయి.
కౌలును ఆపేసిన రైతులు
2017 వరకు కౌలు చెల్లించిన పురుషోత్తపట్నం వాసులు అక్కడి రాజకీయాల ప్రభావంతో ఆ తర్వాతి నుంచి కౌలు చెల్లించడం ఆపేశారు. పైగా భూములు ఆక్రమించి నిర్మాణాలు మొదలుపెట్టారు. దీంతో ఈ భూముల రక్షణ కోసం దేవస్థానం అధికారులు, ఆక్రమణదారులతో నిత్యం పోరాడాల్సి వస్తున్నది. పురుషోత్తపట్నం వాసుల ఆక్రమణలపై ఎటపాక పోలీస్స్టేషన్లో భద్రాచలం దేవస్థానం 61 సార్లు ఫిర్యాదులు చేసినా అక్కడి పోలీసులు స్పందించలేదు. అంతేకాదు, ఫిర్యాదు తీసుకున్నట్టు రసీదు కూడా ఇవ్వడం లేదని దేవస్థానం అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు.
పట్టింపులేని బీజేపీ.. భక్తుల అసహనం
రామయ్య ఆస్తుల పరిరక్షణపై బీజేపీకి పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తుండటం భక్తులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అక్కడి ప్రభుత్వంతో చర్చించి రామయ్య భూములు భద్రాద్రి దేవస్థానానికి చెందేలా ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నిస్తున్నారు.
దాడిపై దేవాదాయ ఉద్యోగుల ఖండన
భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవిపై జరిగిన దాడిని యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగులు ఖండించారు.