ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్ద గురువారం బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. బ్యాంకర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులకు రుణమాఫీ కాలేదని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో రైతులు బ్యాంకు ఎదుట బైఠాయించారు. అర్హులందరికీ రుణమాఫీ చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. రుణమాఫీ వివరాలను తెలుపాలని, అధికారులు బ్రోకర్ వ్యవస్థను మానుకోవాలని సూచించారు. -గుడిహత్నూర్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దళితబంధు రెండోవిడత బాధిత సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు పెండింగ్‌లో ఉన్న రెండోవిడత డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
-కరీంనగర్, (నమస్తే తెలంగాణ)
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 8వ కోజుకు చేరాయి. ఈ సందర్భంగా గురువారం గ్రామంలో వంటావార్పు నిర్వహించారు. అనంతరం రోడ్డుపై కూర్చొని సహపంక్తి భోజనాలు చేశారు. కాంగ్రె స్ ప్రభుత్వం వస్త్రాల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
-గంగాధర