చట్టబద్ధంగా రావాల్సిన వాటిని పట్టించుకోని కమలనాథులు
తెలంగాణకిచ్చే నిధుల్లో భారీ కోత
కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు
ములుగు, పరకాల, నర్సంపేటలో దవాఖాన బ్లాకులకు శంకుస్థాపన
వరంగల్, మార్చి 5 ములుగు, వరంగల్ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విషయంలో నెరవేర్చడంలేదని ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ప్రతి ఒక్కరి సమగ్ర ఆరోగ్య సమచారాన్ని నమోదు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మంత్రి హరీశ్‌రావు శనివారం ప్రారంభించారు. నర్సంపేట, పరకాలలో జరిగిన బహిరంగసభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టానికి చట్టబద్ధంగా రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును బీజేపీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా రూ.20 కోట్లను మొక్కుబడిగా మంజూరు చేసి చేతులు దులుపుకున్నదని మండిపడ్డారు. గిరిజన యూనివర్సీటీ అని చెప్పి ఆ వర్గాలకు 7.5 శాతం రిజర్వేషన్లు అని గిరిజనులను మోసం చేస్తున్నదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన రెసిడెన్సియల్ విద్యా సంస్థలలో 90 శాతం సీట్లను గిరిజనులకే కేటాయిస్తున్నదని చెప్పారు. గిరిజన లా కోర్సును, మహిళలకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చే నిధులలో కోత పెట్టిందని ఆరోపించారు. కరెంటు సంస్కరణలు తెచ్చి రైతుల బావులు, బోర్ల వద్ద మోటార్లకు మీటర్లు పెడితే ఐదేండ్లలో రూ.25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని గుర్తుచేశారు. రైతులను ఇబ్బంది పెట్టేదిలేదని, ఆ నిధులు అవసరం లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మోటార్లకు మీటర్లు పెట్టిందని, సీఎం కేసీఆర్ ఒక్కరే రైతులకు అండగా నిలిచారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసీ, సింగరేణి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి వాటిని అమ్ముతూ ఉద్యోగాలను రద్దు చేస్తున్నదని చెప్పారు.
రాష్ర్టాల చూపు తెలంగాణ వైపు
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణ వైపే చూస్తున్నాయని మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. మంచి నాయకుడు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. ఒకప్పుడు బెంగాల్‌ను అనుసరించేలా దేశంలోని ఇతర రాష్ర్టాల పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ మార్గంలోనే నడుస్తున్నాయని అన్నారు. కేసీఆర్ పెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతోపాటు చాలా రాష్ర్టాలు కాపీ కొట్టాయని చెప్పారు. దేశంలోనే వేగంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని రైతులకు సాగునీరు అందుతున్నదని.. ఈ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు కొందరు ఢిల్లీకి ఉత్తరాలు రాశారని, కేసులు వేశారని చెప్పారు. మహారాష్ట్రలో కరెంటు లేక తెలంగాణ సరిహద్దులోని ఆ రాష్ట్ర రైతులు మనవైపు కొంత భూమి కొని బోర్లు వేసుకొని వారి పొలాలకు పైపులు వేసుకుంటున్నారని తెలిపారు. సరిహద్దులోని మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ర్టాల్లోని ప్రజలు, ఎమ్మెల్యేలు వారి ప్రాంతాలను మన రాష్ట్రంలో కలపాలని కోరుతున్నారని చెప్పారు. మహారాష్ట్రలోని కొందరు సర్పంచులు ఇటీవల తెలంగాణలో పర్యటించారని, మన రాష్ట్రంలో వారి గ్రామాలను విలీనం చేయాలని కోరారని తెలిపారు. తమిళనాడులోని రైతులు కాళేశ్వరం ప్రాజెక్టును చూసి వారి రాష్ట్రంలో ఇలాంటివి లేవని చెప్పారని తెలిపారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ములుగు జిల్లా కేంద్రంలోని దవాఖానలో 250 పడకల విభాగం నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన రేడియాలజీ ల్యాబ్‌ను ప్రారంభించారు. పరకాలలో 100 పడకల దవాఖాన, నర్సంపేటలో 250 పడకల దవాఖాన, టీ డయాగ్నస్టిక్ సెంటర్, 15 హెల్త్ సెంటర్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చేలా సీఎం కేసీఆర్ ప్రణాళికలు అమలు చేస్తున్నారని చెప్పారు. రూ.1100 కోట్లతో వరంగల్ నగరంలో 24 అంతస్తులతో అతిపెద్ద దవాఖానను నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ ముగిసిందని, పనులు త్వరలోనే మొదలవుతాయని చెప్పారు.