రాజన్న సిరిసిల్ల, మే 18 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని నేతన్న చౌరస్తాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులపై సోమవారం బీజేపీ నాయకులు దాడిచేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తలు లక్కిరెడ్డి కమాలాకర్‌రెడ్డి, రవీందర్ గాయపడ్డారు. ఎస్పీ మహేశ్ బీ గీతే రంగంలోకి దిగి, బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు.

బీఆర్ఎస్ శ్రేణులను ఎస్పీ, డీఎస్పీ నాగేంద్రచారి సముదాయించి అక్కడి నుంచి పంపించారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ బీజేపీ దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం మొదటి బైపాస్ రోడ్డుపై బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ వంద అడుగుల భారీ ఫ్లెక్సీతో రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. బాలికకు న్యాయం చేయాలంటూ, కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి ఫ్లెక్సీని లాక్కున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులకు తోపులాట జరిగింది. అందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను తంగళ్లపల్లి ఠాణాకు తరలించారు.

కొడుకును దాచిపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడిన బండి సంజయ్‌కు సిగ్గు .. శరం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం చేయాలని, తన కొడుకు పోక్సో కేసు నమోదైనందున నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి పదవికి బండి రాజీనామా చేయాలని శాంతియుతంగా నిరసన చేపట్టామని పేర్కొన్నారు. నిరసనకారులపై బీజేపీ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్‌కు కరీంనగర్ పార్లమెంట్ పరిధి ప్రజలే బుద్ధిచెబుతారని వెల్లడించారు. నిందితుడికి శిక్ష పడేవరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.

కరీంనగర్ కార్పొరేషన్/ హుస్నాబాద్, మే 18: బాధిత బాలికకు న్యాయం చేయాలని, పోక్సో కేసులో అరెస్టయిన భగీరథ్‌ను తొమ్మిదిరోజులుగా కాపాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ల్లో బీఆర్ఎస్ సోమవారం ఆందోళన చేపట్టింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్‌లో పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అనంతరం ఫ్లెక్సీ దహనం చేసేందుకు య త్నించగా, పోలీసులు అడ్డుకొని, బలవంతంగా లాకున్నారు.

ఇక్కడ మాజీ ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థల మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు హరిశంకర్, రాష్ట్ర మైనారి టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్హుస్సే న్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు పాల్గొన్నారు.

గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్, జగిత్యాల జాతీయ రహదారిపై చేపట్టిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. మానకొండూర్‌లోని కరీంనగర్-వరంగల్ రహదారిపై పల్లెమీద చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు.

బండి సంజయ్‌ని తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేటల్లో సోమవారం పెద్దఎత్తున నిరసన ర్యాలీలు కొనసాగాయి. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని నేతన్నచౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా చేపట్టిన నిరసనపై బండి అనుచరులు, బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తలు లక్కిరెడ్డి కమాలాకర్‌రెడ్డి, రవీందర్ గాయపడ్డారు. ఈ సందర్భంగా లాఠీచార్జి చేసిన పోలీసులు.. దాడికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.