వేమనపల్లి, అక్టోబర్ 10 : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ (47) ఆత్మహత్య కలకలం రేపింది. కాంగ్రెస్ నేతల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్ రాసి ఉరివేసుకున్నాడు. ‘ రుద్రభట్ల సంతోష్, గాలి మధు, చింతకింది కమల రాజకీయంగా ఎదుర్కొనలేక నాపై తప్పుడు కేసులు పెట్టించి నా పరువు, ప్రతిష్ఠను దెబ్బతీసి నా చావుకు కారణమయ్యారు.
వీళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని రాసిన సూసైడ్ నోట్ మధుకర్ జేబులో లభించింది. స్థానికుల కథనం ప్రకారం.. సద్దుల బతుకమ్మ రోజు నీల్వాయిలో డీజే పాటలు పెట్టుకొని బతుకమ్మ ఆడుతున్నారు. మధుకర్ చెప్పినప్పటికీ సౌండ్ తగ్గించకపోగా మరింత పెంచడంతో మధుకర్ డయల్ 100కు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి డీజే ఆపారు. ఆ తర్వాత ఓ మహిళ ఫిర్యాదుతో మధుకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.