KCR | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పేరు ఉందని రాష్ట్రంలోని విద్యార్థులకు అందజేసిన దాదాపు 25 లక్షల పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉందని వెనక్కి తీసుకోవడం చాలా బాధాకరమని అన్నారు.
పుస్తకాలను మళ్లీ ముద్రిస్తే ప్రజలపైనే భారం పడుతుందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఖజానాకి భారం కలిగిస్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. పుస్తకాలను యథావిధిగా పంపిణీ చేయాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పుస్తకాల్లో కేసీఆర్ బొమ్మ వచ్చి ఉండొచ్చని.. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేతప్ప ఇచ్చిన పుస్తకాలను తిరిగి తీసుకోవద్దని హితవు పలికారు. పుస్తకాల్లో చించేసిన పేజిల వెనుక జాతీయ గీతం ఉందని తెలిసిందని.. దాన్ని తీసేయడం మంచి పద్ధతి కాదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఏపీలో గత ముఖ్యమంత్రి బొమ్మ ఉన్న పుస్తకాలను అలాగే పంపిణీ చేస్తున్నారని చెప్పారు.
పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఐదు హామీలపై చంద్రబాబు సంతకం చేశారని తెలిపారు. వృద్ధాప్య పింఛన్లను రూ.2వేల నుంచి రూ.4వేలకు పెంచారని అన్నారు.తెలంగాణలో వృద్ధాప్య పింఛన్లు రూ.4వేలు చేస్తామని చెప్పారని.. కానీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయ్యిందని అన్నారు. హామీల అమలును రేవంత్ రెడ్డి మరిచిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.