Maheshwar Reddy | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ నడుస్తోందని ఇటీవల ఆరోపించిన ఆయన.. దీనిపై ఉత్తమ్ స్పందన కోసం నిన్న పొద్దుపోయే దాకా చూశానని చెప్పారు. తాను చెప్పినవన్నీ వాస్తవాలు కాబట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి మొహం చాటేశారని విమర్శించారు. ఏం చేయాలో తెలియక.. తనపై పోలీసు కేసు పెట్టించారని అన్నారు.
ఉత్తమ్‌కు చేతనైతే దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసినా సరే సాక్ష్యాధారాలతో నిరూపించడానికి రెడీగా ఉన్నానని తెలిపారు. పోలీసు కేసుల వల్ల ఏ సమస్య పరిష్కారం కాదని అన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి ఈ ఏడాది 25వ తేదీన ఇచ్చిన జీవోలో టెండర్ ప్రాసెసింగ్ చేయాలని చెప్పారని.. అదే రోజు గ్లోబల్ టెండర్ పిలిచారని ప్కేన్నారు. గ్లోబల్ టెండర్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారని.. అదేరోజు కొంతమంది మిల్లర్లను పిలిచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఏం చేశారో ఆధారాలతో సహా బయటపెట్టమంటారా? అని ప్రశ్నించారు. క్వింటాలుకు రూ.216 ఇవ్వాలని రైస్ మిల్లర్లను డిమాండ్ చేసింది నిజం కాదా? అని నిలదీశారు. మీరు చేసిన వసూళ్ల అరాచకాన్ని బయటపెట్టమంటారా? అని మండిపడ్డారు. క్వింటాల్‌కు రూ.216 కోట్ల చొప్పున 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గానూ రూ.800 కోట్ల మేర వసూలు చేశారో? లేదో? బయటపెట్టాలని నిలదీశారు. రెండు నెలలు అయినా ధాన్యాన్ని ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ధాన్యాన్ని లిఫ్ట్ చేయకపోతే టెండర్లు తీసుకున్న కంపెనీలు ఏం చేస్తున్నాయని అడిగారు. లక్ష మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని క్వింటాల్‌కు రూ.2259 చొప్పున అమ్మి.. 2.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని క్వింటాల్‌కు రూ.5700 చొప్పున కొనడం వెనుక ఉన్న మతలబు ఏంటో చెప్పాలన్నారు. వీటిపై పూర్తి సమాచారం తన దగ్గర ఉందని.. ఒక్కొక్క చిట్టా విప్పుతానని తెలిపారు. పోలీసు కేసులకు, లీగల్ యాక్షన్లకు తాను భయపడేది లేదన్నారు. కాలేజీలను, కోట్ల ఆస్తులను పక్కనబెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని అని స్పష్టం చేశారు.