ఆ పార్టీ నేతలకు ఒళ్లంతా విషమే తప్ప విషయం లేదు
మోదీ ఉత్తర భారతానికి, యూపీకే ప్రధాన మంత్రా?
దేశంలో దరిద్రపుగొట్టు, నికృష్ట పాలన సాగుతున్నది
నిజామాబాద్ పర్యటనలో మంత్రి కేటీఆర్ ఆగ్రహం
119 కోట్లతో సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన
‘కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఇక్కడే రక్తదాన శిబిరం జరుగుతున్నది. కొంతమందిని నేను పలుకరించిన. అక్బర్, సాయిబాబా అనే ఇద్దరు శిబిరంలో రక్తం ఇస్తున్నరు. మనసులో ఒకటే అనిపించింది. అక్బర్ రక్తం ఆకుపచ్చగా ఉంటుందా? సాయిబాబా రక్తం ఇంకో విధంగా ఉంటుందా? మతం ఏదైతే ఏంది? అక్బర్ మనోడు కాదన్నట్టు.. సాటి మనిషి కాదన్నట్టు.. వాళ్లను వేరు చేసి చూపించుడు. తెల్లారి లేస్తే విషం చిమ్ముడు. ద్వేషం చిమ్ముడు జరుగుతున్నది. బీజేపీ వాళ్లకు దేశం కోసం ఫికర్ లేదు. వారి మనసు, శరీరం మొత్తం విషం తప్ప విషయం లేదు. -మంత్రి కేటీఆర్
ఫటా ఫట్
బీజేపీ నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. వారికి మరోసారి అధికారమిస్తే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేస్తారు. అంతటి పుణ్యాత్ములు వాళ్లు. బీజేపీ నేతలు మాటిమాటికీ హిందుస్థాన్, పాకిస్థాన్ లేదంటే దేశం కోసం ధర్మం కోసం అని సోది చెప్పటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు.
అక్బర్ రక్తం ఆకుపచ్చగా ఉంటుందా? సాయిబాబా రక్తం ఇంకోరకంగా ఉంటుందా? మనుషులను వేరుచేయటం ఎందుకు?
చట్టసభల్లో బిల్లులు ఎలా పాస్ చేస్తారో తెల్వనోడు ప్రధానమంత్రిగా ఉండటం మన ఖర్మ. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకివ్వరు? తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా?
తెలంగాణకు రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వరు కానీ.. వాట్సాప్ యూనివర్సిటీ నడుపుతున్నారు. కిషన్రెడ్డీ.. తెలంగాణలో పర్యటించి రైతులను అడుగు గుణాత్మక మార్పు అంటే ఏమిటో వాళ్లే చెప్తారు?
నిజామాబాద్, ఫిబ్రవరి 16 : కేంద్రంలో బీజేపీని మరోసారి గెలిపిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపేస్తారని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. వాళ్లు అవకాశం కోసం చూస్తున్నారని, మళ్లీ అధికారం ఇస్తే మనల్నే అమ్మేస్తారని అన్నా రు. పొరపాటున కూడా బీజేపీ నేతల మాట వినొద్దని సూచించారు. జీవితాలు బాగుపడతాయని నమ్మి కేంద్రంలో బీజేపీకి ప్రజలు అధికారమిస్తే, జీవిత బీమా సంస్థను కూడా అమ్మేస్తున్నారని విమర్శించారు. దేశంలో దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తున్నారని, ఎల్ఐసీ, రైల్వే, ఎయిర్ ఇండియా.. ఇలా దేశ ప్రజల ఆస్తిని అంగట్లో పెట్టారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్లో రూ.119.41 కోట్లతో నిర్మించనున్న రిజర్వాయర్‌కు స్థానిక ఎమ్మెల్యే, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. సిద్ధాపూర్ అటవీ ప్రాంతంలో పోచారంతో కలిసి కలియ తిరిగారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో దరిద్రపుగొట్టు, నికృష్టమైన పాలన సాగుతున్నదని మండిపడ్డారు. ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రైతుల మీద, రైతుకూలీల మీద ప్రేమలేదు. గిరిజనులు, దళితులంటే లెక్కే లేదు. దేశంలోని 40 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలకు మొన్నటి బడ్జెట్లో కేంద్రం పెట్టిన నిధులు రూ. 12,800 కోట్లు. అంటే ఒక్కో వ్యక్తికి రూ.300 కూడా రావు. ఇదీ బీజేపీ చెప్పే సంక్షేమం’ అని విమర్శించారు.
వాళ్లలో విషమే తప్ప విషయం లేదు
రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా కులం, మతం లేకుండా అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఇక్కడే రక్తదాన శిబిరం జరుగుతున్నది. కొంతమందిని నేను పలుకరించిన. అక్బర్, సాయిబాబా అనే ఇద్దరు శిబిరంలో రక్తం ఇస్తున్నరు. మనసులో ఒకటే అనిపించింది. అక్బర్ రక్తం ఆకుపచ్చగా ఉంటుందా? సాయిబాబా రక్తం ఇంకో విధంగా ఉంటుందా? మతం ఏదైతే ఏంది? అక్బర్ మనోడు కాదన్నట్టు.. సాటి మనిషి కాదన్నట్టు.. వాళ్లను వేరు చేసి చూపించుడు. తెల్లారి లేస్తే విషం చిమ్ముడు. ద్వేషం చిమ్ముడు జరుగుతున్నది. బీజేపీ వాళ్లకు దేశం కోసం ఫికర్ లేదు. వారి మనసు, శరీరం మొత్తం విషం తప్ప విషయం లేదు. బీజేపీ నాయకులు రెచ్చగొడితే పదిమంది యువకులు లొల్లి చేయబోయారు. ఆ తమ్ముళ్లను నేను ఒకటే కోరుతున్నా.. నిరసనకు వచ్చేముందు ఏడున్నరేండ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ చేసిందేమిటో తెలుసుకోండి. మోదీ పాలనలో 158 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు వచ్చింది గుండుసున్నా. కొత్తగా 87 నవోదయ పాఠశాలలు, 8 ఐఐఎంలు, 6 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ విద్యాసంస్థలు మంజూరైతే మనకు ఇచ్చింది గుండుసున్నా. ఇందుకేనా మీరు మా కార్లకు అడ్డుపడుతున్నది? మీ మోదీని, మీ బీజేపీ నాయకులను నిలదీయొస్తలేదా?’ అని ప్రశ్నించారు.
బీజేపీలో దమ్మున్నోడు లేడా?
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని మెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, గురుకులాలు కొత్తగా వచ్చాయో చెప్పే దమ్ము మాకున్నది, వీటిపై చర్చించే దమ్ము ఒక్క బీజేపీ లీడర్కన్నా ఉన్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలో ఉండే బాధ్యత గల నాయకుడికైనా తెలంగాణకు ఏం చేశారనేదానిపై చర్చించే దమ్ముందా? అని సవాల్ విసిరారు. కొట్లాడి, పోరాడి, ధర్నాలు, వంటావార్పులు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే ఇప్పుడు ప్రధానమంత్రి ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ‘ఒకనాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. నిన్నగాక మొన్న అన్యాయంగా ఏపీ పునర్విభజన బిల్లును పాస్ చేసిండ్రని మాట్లాడిండు. ఇది దుర్మార్గం కాదా? చట్ట సభల్లో ఏ బిల్లు అయినా తలుపులు మూసే పాస్ చేస్తారు. అది తెల్వనోడు ప్రధానిమంత్రిగా ఉండటం మన ఖర్మ. కర్ణాటకలో తుంగభద్ర నదిపై అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తరు. కేంద్రం నుంచి 90 శాతం నిధులిస్తరు. తెలంగాణ ఈ దేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఎందుకివ్వరు? పాలమూరు ఎత్తిపోతలకు ఇవ్వరేం? మీదికెళ్లి తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్నరు. పొద్దున లేస్తే మొరిగే బీజేపోళ్లు సమాధానం చెప్పాలె. ఇలాంటోళ్లకు తెలంగాణ గడ్డపై ఇంకా పుట్టగతులుండాలా? అలాంటి పార్టీలను ప్రజలే తరిమితరిమి కొట్టాలె’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
నిజాంసాగర్ నీళ్ల కోసం ఏడ్చినా: పోచారం
ఉమ్మడి రాష్ట్రంలో నిజాంసాగర్ నీటి కోసం పడిన గోస అంతా ఇంతా కాదని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటికి ఎలాంటి రంది లేకుండా పోయిందని తెలిపారు. మంత్రి కేటీఆర్ పనితీరు అద్భుతమని కితాబిచ్చారు. దేశమే నివ్వెరపోయేలా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలోని పథకాలను తమవద్ద కూడా అమలు చేయాలని బీజేపీకి చెందిన రాయ్‌చూర్ ఎమ్మెల్యే అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని కోరడమే సీఎం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేష్‌గుప్తా, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
విభజనను ప్రశ్నిస్తే వీళ్లలో రోషం లేదా?
గుజరాతీ వ్యక్తి తెలంగాణపై విషం చిమ్ముతుంటే ఇక్కడ పుట్టిన దౌర్భాగ్యులు మిన్నకుండిపోయారని మంత్రి కేటీఆర్ రాష్ట్ర బీజేపీ నాయకులనుద్దేశించి మండిపడ్డారు. ‘విభజననే ప్రశ్నిస్తే.. వీళ్లకు రక్తం మరుగతలేదా? వీళ్లలో తెలంగాణ రక్తం లేదా? వీళ్లకు రోషం లేదా? చాతనైతలేదా? తెగువ లేదా? ఇలాంటోళ్లు తెలంగాణలో ఉండటం మన దౌర్భాగ్యం కాదా?’ అని నిప్పులు చెరిగారు. తెలంగాణకు రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వరు కానీ.. వాట్సాప్ యూనివర్సిటీ నడుపుతున్నారని విమర్శించారు. ‘ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు.. ఒక్క విద్యా సంస్థనూ ఇవ్వరు.. నిధులివ్వరు.. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు.. ఉక్కు కర్మాగారం మరిచిపోయారు.. తెలంగాణ అంటే బీజేపీ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష? మోదీ.. నువ్వు ఉత్తర భారతదేశానికి, ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే ప్రధానమంత్రివా? మాకు కాదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. గుణాత్మక మార్పు అంటే ఏమిటని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడుగుతున్నారని, రాష్ట్రంలో రైతులను అడిగితే దాని గురించి చెప్తారని సూచించారు. ‘చేనేత కార్మికుల కండ్లలో వెలుగులు, మత్స్య కార్మికుల్లో ఆత్మవిశ్వాసం, దళితబంధుతో దళితుల్లో పెరిగిన ఆత్మైస్థెర్యం, రైతు రెక్కల కష్టాన్ని కొనలేని ఎఫ్‌సీఐ దౌర్భాగ్యాన్ని చూసైనా తెలంగాణలోని గుణాత్మక మార్పుపై కిషన్‌రెడ్డి అవగాహన తెచ్చుకోవాలి’ అని సూచించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న బాన్సువాడ మున్సిపాలిటీని మరింత ప్రోత్సహించేందుకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. సిద్ధ్దాపూర్ రిజర్వాయర్, జాకోరా-చందూర్ ఎత్తిపోతలతో బాన్సువాడ అత్యధికంగా పంటలు పండించే నియోజకవర్గాల్లో ఒకటిగా మారుతుందని కేటీఆర్ అన్నారు.