హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ విపక్షాలను ఏకం చేస్తుండటంతో బీజేపీకి చెమటలు పడుతున్నాయి. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభకు మూడు రాష్ర్టాల సీఎంలు, మాజీ సీఎంలు, వామపక్షాల జాతీయ నాయకులు, భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండటంతో బీజేపీ నేతలకు భవిష్యత్తు కండ్లకు కడుతున్నది. ఈ సభతో సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతారని అర్థమైంది.
దీంతో జాతీయ మీడియాను ఖమ్మం సభ నుంచి దృష్టి మళ్లించడంతోపాటు, భవిష్యత్తు పరిణామాలపై చర్చించేందుకు జాతీయ కార్గవర్గ సమావేశాలు ఏర్పాటు చేసింది. ‘జాతీయ సమావేశాలు ఉన్నాయని మొన్నటిదాకా మాకు తెలియదు. సడన్‌గా డేట్లు ఫిక్స్ చేశారు. రమ్మన్నారు. మా రాష్ట్ర నేతలు ఎవరెవరు పోతున్నారనే విషయం నిన్నటి దాకా మాకు తెల్వదు’ అని ఓ సీనియర్ బీజేపీ నాయకుడు చెప్పారు. వాస్తవానికి ఈ నెల 19న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించాల్సి ఉన్నది.
వందేభారత్ రైలును కూడా అప్పుడే ప్రారంభిస్తారని, పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారని ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఒకటిరెండు రోజులు హడావుడి చేశారు. కానీ.. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ సభ పట్ల ఆసక్తిగా ఉండటం, జాతీయ మీడియా సైతం ఖమ్మం వైపే దృష్టిపెట్టారని మోదీకి సమాచారం అందింది. 18న సభ భారీగా జరిగి దేశవ్యాప్తంగా చర్చ జరగటం ఖాయమని, 19న తన పర్యటనను ఎవరూ పట్టించుకోరని ప్రధానికి అర్థమైంది. దీంతో వెనక్కి తగ్గారు. ‘అనివార్య కారణాలు’ వంకతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకొన్నారు. వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. మళ్లీ జాతీయ మీడియా దృష్టిని మరల్చేందుకు జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేశారు.
సోమ, మంగళవారాల్లో సమావేశాలు నిర్వహించి, మీడియా సమావేశాలు పెట్టి, ఈ అంశం మీదే చర్చ జరిగేలా చూడాలన్నది బీజేపీ ప్లాన్‌గా కనిపిస్తున్నది. తద్వారా ఖమ్మం సభకు ముందస్తుగా ఎలాంటి ప్రచారం రాకుండా అడ్డుకోవాలని భావిస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభపై ఇప్పటికే ప్రజలందరికీ స్పష్టత ఉన్నది. దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో లోతైన చర్చ జరుగుతున్నది. జాతీయ మీడియా సంస్థలు ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆలోచనలపై, వ్యూహాలపై ప్రత్యేక కథనాలు సిద్ధం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ చేసేదంతా వృథాయేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.