వారకాంత వరలక్ష్మీ వ్రతం చేసిందని.. బండి సంజయ్ యాదాద్రి గుళ్లో ప్రమాణం చేశారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులను స్వామివారి పాదాల వద్ద ఉంచి అపవిత్రం చేశారు. అబద్ధాలు గుక్క తిప్పుకోకుండా వల్లె వేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర ఎలా చేశారో మీడియాలో అక్షరమక్షరం ఆడియో రూపంలో బయటపడుతూ బీజేపీ బట్టలు విప్పి నగ్నంగా నిలబెడుతున్నా.. ప్రజలు ఛీ కొడుతున్నా లెక్కలేదు. దేవుడి సమక్షంలో ఉన్నానన్న స్పృహే లేదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు..
ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ కుట్ర అనే ఎదురు ఆరోపణలు! జనం ఏమనుకొంటారన్న ధ్యాస లేదు. జంకు లేదు. దేవుని సన్నిధిలో ఉన్నామన్న పాపభీతి అంతకన్నా లేదు. నిన్నగాక మొన్న కేవలం ఒక అసెంబ్లీ ఎన్నిక కోసం తమ పార్టీయే రూ.18వేల కోట్ల డీల్ చేసుకున్న విషయం గుప్పుమన్న సంగతి.. తమ పార్టీ పాపపు చూపు పడ్డ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ కొనసాగలేదన్న వాస్తవం ఎరిగీ బీజేపీ పరిశుద్ధమైందని ప్రమాణం చేశారు. దేవుడెలాగూ నోరు విప్పడు.. అదీ ధైర్యం.
నోటికి హద్దా.. పద్దా?
బండి ఆరోపణల పర్వం కొత్తేమీ కాదు. గతంలో కేటీఆర్ మీద బండి సంజయ్ అడ్డగోలు ఆరోపణలు చేస్తే.. కేటీఆర్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఇదే బండి సంజయ్‌ని సిటీ సివిల్‌కోర్టు రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి అరుదైన ఆదేశాలు అందుకున్న అరుదైన ఘనత ఆయనది. అసలు బండి సంజయ్ క్రెడిబిలిటీ ఎంత? ఆయన మాటకు విలువెంత? పెద్ద గొంతేసుకొని ఊగిపోతూ అరవడమే తప్ప ఆ మాటల్లో సబ్జెక్ట్ ఎంత? రాష్ట్రం మీద ఆయన అవగాహన ఎంత? గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్రానిదో రాష్ర్టానిదో, దాని చెల్లింపులు ఎలా జరుగుతాయో తెలియని ‘విజ్ఞానం’ ఆయనది. బీహెచ్ఈఎల్ కేంద్రప్రభుత్వరంగ సంస్థ అనే సోయి లేకుండా కాంట్ట్రాక్టుల్లో అవినీతి జరిగింది అనేంత ప్రాపంచిక అవగాహన ఆయనకే సొంతం. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారింది కాబట్టి మళ్లీ తాజాగా ప్రజల తీర్పుకోరేందుకు అసెంబ్లీ రద్దు చేయాలని డిమాండ్ చేసేంత రాజకీయ పరిజ్ఞాని బండి! ‘పాలమూరులో వలసలు లేవని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా’ అని ఓసారి, ‘కేంద్ర చట్టంలో విద్యుత్తు మీటర్ల ప్రస్తావనే లేదు.. కేసీఆర్ చెప్పినట్టు మీటర్లు అనేది అబద్ధం.. ఆ బిల్లు ప్రతులను కేసీఆర్‌కు పంపిస్తా. అందులో మీటర్ల ప్రస్తావన ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా’ అని సవాలు చేసి తీరా అదే చట్టంలో ఆ ప్రస్తావన మీడియా ముఖంగా వెల్లడిస్తే పారిపోయిన చాలెంజ్ రాముడు ఆయన.
ఆధ్యాత్మికతను అణువణువునా రంగరించుకొని, అనేక యాగాలు చేసిన, ఒక తపస్సులా పూనుకొని, అన్నీ తానై యాదాద్రి ఆలయాన్ని నిర్మించిన కేసీఆర్‌ను పట్టుకొని ‘ఆయనకు దేవుడిమీద నమ్మకం లేదు, క్షుద్రపూజలు చేస్తున్నారు’ అనగలిగినంత గొప్ప నోరు ఆయనది. అంతేకాదు ఆయన ఎక్కడ చూశారో గానీ విచిత్రంగా కల్లు గీసే చోట డ్రంక్ అండ్ డ్రైవ్‌లు పెడుతున్నారని ఆరోపిస్తారు. కనీసం తన పార్టీ విషయంలోనూ ఆయన మాటలు ‘ఉన్న ఓట్లను పోగెట్టేలా ఉన్నాయని’ గ్రహించకుండా ‘మాకు ఓట్లే వేయరు.. మిమ్మల్ని ఎట్లా నమ్మాలి?’ అని బ్రాహ్మణ సంఘాలను పట్టుకొని నోరు పారేసుకుంటారు. బండి పోతె బండి ఫ్రీ, కారు పోతె కారు ఫ్రీ.. అన్న జీహెచ్ఎంసీ వాగ్దానాలు సోషల్ మీడియాలో ఎవర్గ్రీన్ సెటైర్లు. సరే మసీదులు తవ్వడాలు, ఉర్దూ అధికార భాష తొలగింపు వంటి వ్యాఖ్యలు సరేసరి. ఇంతోటి అంబలికి ఇరవై పేర్లని పోనీ మీ మోదీ ప్రభుత్వం సాధించిందేమో చెప్పమంటే 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ రద్దు, రామమందిర నిర్మాణం బీజేపీ సాధించిన విజయాలని ప్రకటిస్తారు. అవి విని తరించాలి!!
పాపం తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ ఆ మధ్య తెలంగాణకు శ్రీలంక గతి పట్టబోతున్నదని.. తెలంగాణను చూస్తే శ్రీలంక గుర్తుకు వస్తున్నదని అన్నారు.మరి శ్రీలంకను చూస్తే ఏం గుర్తుకు వస్తుంది? మోదీ.. ఆయన వ్యాపార మిత్రుడి కుంభకోణం శ్రీలంక పార్లమెంటులో ప్రతిధ్వనించిన విషయం కాదా? ఆ దెబ్బకు రాజపక్స ప్రభుత్వం కుప్పగూలిన విషయం వాస్తవం కాదా?
కొనుగోళ్ల రికార్డు ఎవరిది?
అడ్డగోలు వాగ్దానాలు గుప్పించి ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీకి రెండోసారి అధికారంలో వచ్చాక అధికార మదం తలకెక్కింది. తామేదో శాశ్వతంగా అధికారంలో ఉంటామన్న భ్రమలో పడ్డారు. నైతిక విలువలు, క్రమశిక్షణ కలిగిన పాత నేతలను పీకిపారేసి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అణాకానీ సన్నాసులను పదవుల్లోకి తెచ్చారు. వాజపేయి బీజేపీని వ్యాపార బీజేపీగా, గూండాల బీజేపీగా మార్చేశారు. ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం తెలియని అడ్డగోలు మూకను తయారు చేసి దేశం మీదికి రాష్ర్టాల మీదికి వదిలారు. అన్ని నీతి నియమాలను గాలికి వదిలి ప్రజాప్రతినిధులను సంతలో గొర్రెలను కొన్నట్టు కొని, అధికారంలోకి రావడం మరిగారు. ఒకటి వెంట ఒకటిగా ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చుతూ వస్తున్నారు. అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఆడింది ఆటగా పాడింది పాటగా మార్చుకున్నారు. తమకు ఎదురేలేదు అనుకొని విర్రవీగి అడ్డగోలుగా ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చిన బీజేపీకి తెలంగాణలో కథ అడ్డం తిరిగింది. మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఈ పార్టీ బాగోతం పబ్లిగ్గా బయటపడింది. కేసీఆర్ ఇచ్చిన షాక్‌కు కేంద్ర పెద్దలు గుడ్లు తేలేశారు. తాము తేలుకుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఉండి ఇక్కడ వారి పెంపుడు జంతువులను ఉసిగొల్పుతున్నారు. వాళ్లు పోటీపడి గుజరాతీ బానిసత్వాన్ని ఒకరిని మించి ఒకరు ప్రకటించుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసిన కుట్ర బయటపడి పరువు పోయినా సిగ్గు ఎగ్గు వదిలేసి, ఎదుటివారిపైనే కుట్ర ఆరోపణలకు దిగుతున్నారు. ఆరున్నొక్క రాగం ఎత్తుకొని పత్తిత్తు కథలు చెప్తున్నారు. ఇంతకాలం ఆ గుడి, ఈ మసీదు అంటూ ఓట్లు అడుక్కున్న రాజకీయ బిచ్చగాళ్లు ఇప్పుడు ఏకంగా గుళ్లోకొచ్చి ప్రమాణాలు, ఇమానాలు అంటూ దబాయింపులకు దిగుతున్నారు. నోరు తెరవని దేవుడిని.. నోరెత్తని సీబీఐ, ఈడీలను, ఇతర వ్యవస్థలను అడ్డం పెట్టుకొని బయటపడాలని చూస్తున్నారు. కానీ దేశంలోని అన్ని రాష్ర్టాలు, అన్ని పార్టీలు, అన్ని వర్గాల వేళ్లు బీజేపీ వైపు చూపుతున్న విషయం మరిచిపోతున్నారు. ఉద్వేగాలు రెచ్చగొట్టి ఉన్మాదాన్ని రగిల్చి దక్కించుకున్న అధికారానికి అంతిమ ఘడియలు ఆసన్నమైనాయని మరుస్తున్నారు. మిర్చీలు, బజ్జీలు ఉపాధికాదా? అన్న నేతలకు భవిష్యత్తులో చాయ్బండ్లు బజ్జీ బండ్లే గతి.
షిండేలను సృస్టిస్తామన్నది నిజం కాదా?
తమ కంటిలో నలుసులా ఉన్న ఉద్ధవ్‌ను దించివేసిన తర్వాత పలువురు జాతీయ, రాష్ట్ర నేతలు అనేక రాష్ర్టాలో షిండేలను సృష్టిస్తున్నామనడం నిజం కాదా? తమిళనాడులో ఓ షిండే ఉన్నాడని పార్టీ కేంద్ర నాయకుడొకరు ప్రకటించిన విషయం వాస్తవం కాదా? తిరుగులేని ప్రజల మద్దతులో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ప్రజారంజకపాలన అందిస్తున్న ప్రభుత్వంలో షిండేలను సృష్టిస్తామనడం దేనికి సంకేతం? ఇవాళ మేం పత్తిత్తులం అంటూ గోలగోల చేస్తున్న ఈ నాయకులే కదా నిన్నటి దాకా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని పోటీలు పడి ప్రకటనలు చేసింది! 50 మంది ఉన్నారు.. వందమంది ఉన్నారని ఈ నాయకులే కదా ప్రకటనలు గుప్పించింది! ఏ జిల్లాలో ఎంతెంత మంది తమతో టచ్‌లో ఉన్నారో ఆ పార్టీనేతే కదా లెక్కలు చెప్పింది! టీఆర్ఎస్లో షిండేలను సృష్టిస్తామని ఈ నాయకులే కదా ప్రకటించింది! కేసీఆర్‌ను జైల్లో పెడతాం ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అనని నాయకుడు బీజేపీలో ఒక్కడైనా ఉన్నారా? ఎక్కడన్నా అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రభుత్వపరంగా లాభం కోసం వస్తారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి ఎందుకు వస్తారు.. డబ్బులు పదవులకోసం కాకపోతే.
పత్తిత్తులైతే కోర్టుకెందుకు వెళ్లారు?
మొయినాబాద్ ఉదంతం ఇలా బయటపడగానే అలా బీజేపీ ఏం చెప్పింది? నందూ ఎవరో తెలియదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఇతరులు ఎవరూ ఎన్నడూ బీజేపీతో సంబంధమున్న వాళ్లు కాదుపొమ్మని బండి సహా ఇతర నాయకులూ వక్కాణించారు. ఇదంతా డ్రామా అని కొట్టిపడేశారు. ఇది కేసీఆర్‌కే చుట్టుకుంటుందని సాక్షాత్తూ బండి సంజయే అన్నాడు. తీరా పోలీసులు నిందితులను ఏసీబీ కోర్టుకైనా తీసుకువెళ్లక ముందే ఎఫ్ఐఆర్లో ఏమున్నదో వెల్లడి కాకముందే బీజేపీ నాయకులు హైకోర్టుకు వెళ్లారు. కేసుకు సీబీఐకి అప్పగించాలని అడిగారు. కోర్టు సిట్టింగ్ జడ్జీలు అనికూడా అంటున్నారు. మీరు పత్తిత్తులైతే కోర్టుకెందుకు వెళ్లారు? అని ఈ బీజేపీ పతివ్రతను మీడియా అడిగినట్టు లేదు. కానీ ప్రజలు మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఆ స్వాములతో బీజేపీకి సంబంధమే లేనట్టయితే కోర్టుకు ఎందుకు వెళ్లినట్టు? మీ పాత్రే లేకపోతే ఎందుకు హైరానా పడుతున్నట్టు? ఈ కేసు మీద ఎందుకంత గాయి పెడుతున్నట్టు? ఏకంగా గుళ్లో ప్రమాణాల దాక ఎందుకు పోతున్నట్టు? దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు కనిపిస్తున్న ఈ వ్యవహారమేమిటి? రాష్ట్ర పోలీసుల మీద మీకు నమ్మకం లేకపోతే కేంద్రపరిధిలోని సీబీఐ మీద రాష్ర్టానికి ఎందుకు నమ్మకం ఉండాలి?
ఈడీ శరణం గచ్ఛామీ..
బీజేపీకి పాపం హైకోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయోనన్న బెంగ పట్టుకున్నట్టుంది. ఎందుకైనా మంచిదని బీజేపీ నాయకులు స్వయంగా సీబీఐకి, ఈడీకి కూడా కేసు దర్యాప్తు చేయాలంటూ వినతి పత్రాలు ఇచ్చారు. అది ఢిల్లీ పెద్దల మంత్రాంగమట. ఏదో రకంగా ఈ కేసును సీబీఐ పేరిట తమ పరిధిలోకి లాక్కోవాలని చూస్తున్నారు. అసలు మోదీ బీజేపీ హయాంలో దేశంలో ఏ వ్యవస్థకన్నా విశ్వసనీయత ఏడ్చిందా? వారిని నిజాయతీగా పనిచేయనిచ్చారా? ప్రతిపక్షనేతల మీద కేసులు పెట్టి వేధించి బీజేపీలో చేరాక కేసులు నీరుగార్చిన ఉదంతాలు కోకొల్లలు.
తాము పీకలదాక కూరుకుపోయిన ఈ కేసులోంచి బయట పడడానికి తాజాగా ఈడీని ఆశ్రయిస్తున్నారని మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. మిగతా వ్యవస్థలతో పోలిస్తే ఈడీలో వ్యవహారం అంతా ఏకపక్షంగా ఉండడం దీనికి కారణమట.
కొస మెరుపు
పాపం ఇన్నాళ్లూ కేసీఆర్‌ది ఫాంహౌస్ పాలన. కేసీఆర్ ఫాంహౌస్నుంచి బయటకు రాడు.. అంటూ బీజేపీ గల్లీనుంచి ఢిల్లీ నాయకుల దాక కోరస్ పాడేవారు. దాన్నొక సెటైర్‌గా వాడుకునేవారు. తాజాగా మొయినాబాద్ ఫాంహౌస్ ఉదంతంలో బీజేపీ పరువు గంగలో కలిసింది. మరి ఇప్పుడు ఫాంహౌస్ అంటే గుర్తొచ్చేదేమిటి?
(ఎస్జీవీ శ్రీనివాసరావు)
ఇవి కాదా నిజాలు
దేశంలో అనేక రాష్ర్టాల్లో మెజారిటీలో ఉన్న ప్రభుత్వాలను కూల్చివేసిన చరిత్ర బీజేపీది. తెలంగాణలో ఒక ఎన్నిక కోసం రూ.18వేల కోట్ల బేరం చేసుకున్నారన్న వార్తలు గుప్పుమన్న ఖ్యాతి ఆ పార్టీది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పచ్చనోట్లు విరజిమ్మి ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మధ్యే బీజేపీ వత్తాసుతో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇచ్చారనే ఆరోపణలు తాజాగా వెలుగు చూశాయి. ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలకు పదవులు, కాంట్రాక్టులు, డబ్బులు కూడా ఆఫర్ చేసినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బయటపెట్టారు. ఓ ముఖ్య నాయకుడికి ఏకంగా ముఖ్యమంత్రి పదవినే ఎరవేసిన విషయం.. దానికి అంగీకరించకపోవడంతో లేని కుంభకోణం పేరిట దర్యాప్తుల పేరిట వేధిస్తున్న అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్నది. జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని కూల్చడానికి గవర్నర్‌ను ఉసిగొల్పడమే కాదు, ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరికి భారీ నగదు ఆఫర్ ఇవ్వడాన్ని ఉత్తరాది పత్రికలు కోడై కూశాయి. మధ్యప్రదేశ్, గోవా, రాజస్థాన్ వ్యవహారాలు ప్రజలకు తెలిసినవే.