సిటీబ్యూరో: హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పోలీసుల తనిఖీల్లో ఈ రెండు కమిషనరేట్లలో 732 మంది పట్టుబడ్డారు. రోడ్డు భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా నగరంలో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వాహనదారులపై సిటీ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆగస్ట్ 7, 8 తేదీల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 421 మంది వాహనదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. పట్టుబడినవారిలో 344 మంది ద్విచక్రవాహనదారులు , 37 మంది ఆటోరిక్షాలు , 40 మంది కార్లు, ఇతర భారీ వాహనాలు నడుపుతున్నవారు ఉన్నారని పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారని సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ జీ నరేందర్ తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా 311 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 238 మంది ద్విచక్రవాహనదారులు, 16 ఆటోలు, 56 కార్ల యజమానులు, 1 భారీ వాహనదారులపై కేసులు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.