హన్మకొండ : తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమి లేదని, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్న బీజేపీ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే ప్రజలు నిలదీయాలని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. కమలాపూర్ మండలం శంభునిపల్లిలో ఆదివారం టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా బీజేపీ నాయకులు రాష్ర్టాభివృద్ధికి అడ్డం పడుతున్నారన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న ఘనత బీజేపీదేనన్నారు. దేశంలోనే రైతులకు రైతుబంధు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ప్రతి సంక్షేమ పథకం నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అని కొనియాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.