హైదరాబాద్, నవంబర్8 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణపై బీజేపీ సర్కారు వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నది. తాజాగా ఐఆర్సీటీసీ ఏర్పాటు చేసిన రామాయణం సర్క్యూట్‌తో బీజేపీ చూపుతున్న వివక్ష మరోసారి బట్టబయలైంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆ సర్క్యూట్లో భద్రాచలం రామాలయానికి చోటు దక్కకపోవడంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. స్వయంగా రాష్ట్ర బీజేపీ నేత, కిషన్‌రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతుండగానే ఇది చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు పలు రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేవిధంగా ఐఆర్సీటీసీ ఇటీవల రామాయణం సర్క్యూట్ పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. ఈ సర్క్యూట్లో ప్రయాణం అయోధ్య నుంచి మొదలై.. నందిగ్రామ్, సీతామర్హి (సీతజన్మస్థలం బీహార్), జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ, శృంగ్వేర్పూర్, చిత్రకూట్, నాసిక్, హంపీ మీదుగా రామేశ్వరం వరకు మొత్తంగా 7500 కిలోమీటర్లు సాగుతుంది. అయితే ఇందులో దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన భద్రాది రాముడికి చోటు దక్కకపోవడం గమనార్హం. కావాలనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆలయంపై వివక్ష చూపుతున్నదని భక్తులు మండిపడుతున్నారు. భద్రాచలం నుంచి కాకపోయినా, కనీసం కొత్తగూడెం నుంచి అయినా ఒక భోగిని ఏర్పాటు చేస్తే బాగుండేదంటున్నారు. ఇప్పటికైనా రామాయణం సర్క్యూట్లో భద్రాద్రిని చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.