స్కూళ్లలో అల్పాహార పథకాన్ని ప్రారంభించుకున్నం. ఇతర రాష్ర్టాల్లో, పక్కనే ఉన్న మహారాష్ట్రలో మధ్యాహ్న భోజనంలో తెల్ల అన్నం, గొడ్డుకారంతో పెడితే.. మనం కేసీఆర్ పాలనలో సన్నబియ్యంతో మమకారంతో పిల్లలకు పోషకాహారం అందజేస్తున్నం. అల్పాహారం పథకంలో భాగంగా పిల్లలకు రుచికరమైన ఇడ్లి, పూరివంటి టిఫిన్లు పెట్టబోతున్నం. విద్యార్థులపై బీజేపీది గొడ్డుకారమైతే.. మన తెలంగాణ సర్కారుది మమకారం.
-మంత్రి హరీశ్‌రావు
కరీంనగర్/నిజామాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సిక్సర్ కొట్టడం ఖాయమని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని తెలిపారు. కేసీఆర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకమని అభివర్ణించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలించింది ఒక్క సీటేనని.. ఈ సారి ఆ సీటు కూడా గల్లంతు కావడం ఖాయమని అన్నారు. ఎన్ని జాకీలుపెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవబోదని చెప్పారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో వంద పడకల దవాఖానను ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో వ్యవసాయ మా ర్కెట్, మహిళా సంఘ భవనాలు, పల్లె దవాఖానకు ప్రారంభోత్సవాలు చేశారు. 21కోట్లతో 50 పడకల దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించిన హరీశ్‌రావు.. తొలుత కామారెడ్డి జిల్లా బిచ్కుందలో వంద పడకల దవాఖానకు ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీ బీబీపాటిల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో వంద పడకల దవాఖాన నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో హరీశ్‌రావు ప్రసంగించారు. తొమ్మిదేండ్లలో కేసీఆర్ సర్కారు చేసిన ప్రగతిని ఏకరువుపెట్టారు. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శనాస్ర్తాలు సంధించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రంగులు మార్చే ఊసరవెల్లి అని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ పదేండ్ల పాలన, బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై చర్చ పెడతామని రేవంత్ విసిరిన సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు అరిగోసపడ్డారని గుర్తుచేశారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్‌రెడ్డి తానడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీలో ఉన్న ఆయన ఏం మాట్లాడాడో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఆనాడు అసెంబ్లీలో ఏం మాట్లాడారో.. ఒకసారి రికార్డులు చూసుకోవాలని చురకలంటించారు. ‘పావురాల గుట్టల్లో పావురమై ఎగిరి పోయిండని రాజశేఖర్‌రెడ్డి గురించి నువ్వు మాట్లాడలేదా? నీది నోరా.. లేక మోరా?’ అని రేవంత్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రోజు ఆలా మాట్లాడి.. ఈ రోజు కాంగ్రెస్ పాలన బాగుందని అంటున్నావని, ఇందులో ఏది నిజం? అని నిలదీశారు. నాడు మాట్లాడిందే నిజమైతే కాంగ్రెస్ పాలనే బాగాలేదన్నట్టు అని, ఇక చర్చకు ఆస్కారమేలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాట్లాడింది నిజమైతే రేవంత్ ఊసరవెల్లులకే ఊసరవెల్లి అని అర్థమైతున్నదని, ఈ ఝూటా మాటలు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకొని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పుచెప్తారని అన్నారు.
నాటి పదేండ్ల కాంగ్రెస్ పాలనకు.. ఇప్పటి పదేండ్ల బీఆర్ఎస్ పాలనకు మధ్యే పోటీగా ఎన్నికలు జరుగుతాయని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు కరెంటు కోతలు. అలవికాని బాధలు అనుభవించారని గుర్తుచేశారు. మళ్లీ ఆ బాధలు వద్దనుకొంటే బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది, హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీనేనని ధీమా వ్యక్తంచేశారు. దేశంలోనే ఎక్కడాలేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. గత పాలకులు బీడీ కార్మికుల కష్టాలను పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పుర్రె గుర్తు పెట్టి.. ఉన్న శాట గుంజుకునే ప్రయత్నం జేసిందని విమర్శించారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా బీడీ పరిశ్రమపై బీజేపీ జీఎస్టీ వేసి దెబ్బతీసిందని దుయ్యబట్టారు. బీడీ కార్మికులకు అండ గా నిలుస్తూ పింఛన్ ఇస్తున్నది కేవలం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. త్వరలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నట్టు తెలిపారు. కోరుట్లలో జరిగిన సభకు బీఆర్ఎస్అభ్యర్థి డాక్టర్ కల్వంకుట్ల సంజయ్, ఇల్లంతకుంటలో జరిగిన సభకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యే విద్యాసాగర్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలన సంక్షేమంలో స్వర్ణయుగం, అభివృద్ధిలో అద్భుతాలను సృష్టించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్ల పరిపాలనలో ప్రతి కుటుంబానికి మేలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కా రు అంటూ చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజలెవ్వరూ సంతోషంగా లేరని అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు సరిగా లేక పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ పరిపాలనలో డబుల్ ఇంజిన్ సర్కారు విఫలమైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పరిపాలనలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు.
తెలంగాణలో ప్రతి గుంటకూ నీళ్లు ఇచ్చింది వాస్తవం. పండిన ప్రతి పంటా కొన్నది వాస్తవం. మోసపోతే ఆగమైతం. కైలాసం ఆటలెక్క పెద్ద పాము మింగే అవకాశం ఉన్నది జాగ్రత్త. పాతాళలోకం నుంచి కేసీఆర్ అద్భుతంగా తెలంగాణనుపైకి తీసుకువచ్చారు. త్వరలో ప్రతిపక్షాలకు దిమ్మదిరిగే మ్యానిఫెస్టో ఉంటుంది. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ మాత్రమే.
-మంత్రి హరీశ్‌రావు
‘మొన్న నిజామాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ల డబుల్ ఇంజిన్ సర్కార్లే ఫెయిల్ అయ్యాయి. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో ఎలాంటి పరిస్థితి ఉన్నదో రోజూ చూస్తూనే ఉన్నం. బీజేపీ పాలిస్తున్న మహారాష్ట్రలో మందుల్లేవు, సూదుల్లేవని దవాఖాన పర్యవేక్షకుడే చెబుతుండటం బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తున్నది. కేంద్రంలో, మహారాష్ట్రలో బీజేపీ ఉన్నప్పటికీ దవాఖానలు బాగు చేసుకోలేని దుస్థితిలో ఉందంటే ప్రజలంతా అర్థం చేసుకోవాలి’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు ఢిల్లీలో అవార్డులు వస్తాయి కానీ బీజేపీ నాయకులు గల్లీకి వచ్చి తిడతారని మండిపడ్డారు. తెలంగాణపై మోదీ, రాహుల్‌గాంధీకి ప్రేమ ఉంటదా? లేదా కేసీఆర్‌కు ఉంటదా? అని ప్రశ్నించారు.
‘కాంగ్రెస్ పార్టీ ఫేక్ సర్వేలు చేస్తున్నది. మాకే సీట్లు ఎక్కువ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నది. గాంధీభవన్‌లో మొన్నటి దాకా అప్లికేషన్ ఫీజుల కోసం డబ్బులు వసూలు చేసిండ్రు. ఇప్పుడు సీట్ల కోసం డబ్బులు అడుగుతుండ్రు. సీట్లను అమ్ముకుంటుండ్రు. బీఆర్ఎస్ వద్దని వదిలేసిన వాళ్లను స్వాగతం పలికి చేర్చుకుంటున్నరు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది మాత్రం కేసీఆరే’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒకప్పుడు దవాఖానకు వెళ్లాలంటే 50 కిలోమీటర్లు వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలాంటి కష్టం ఉండొద్దని 100 పడకల పెద్ద దవాఖానను ధర్పల్లికి తీసుకువచ్చామని, రూ.33కోట్లతో ఈ దవాఖానను ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ‘కాంగ్రెస్ పాలనలో మందుల్లేవు, డాక్టర్లు లేరు. పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా, వంద పడకల హాస్పిటల్, జిల్లాకో మెడికల్ కాలేజీ, నాలుగు టిమ్స్ దవాఖానలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖనలో 1200 ఓపీ ఉంటున్నదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అని పాడుకొంటే.. నేడు ‘పోదాం పద సర్కారు దవాఖాన’కే అని నిరుపేదలు పాడుకొంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్‌తో నేడు పేదలకు వైద్యవిద్య చేరువైందని, ఏటా 10 వేల డాక్టర్లు తయారు చేసే పరిస్థితి తెలంగాణలో ఉన్నదని చెప్పారు.
శ్రీరాముడికి హన్మంతుడు ఎట్లనో కేసీఆర్‌కు హరీశ్‌రావు అలాంటి వారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రిగా హరీశ్‌రావు ఎంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు వైద్యసేవలు అందించేందుకు వైద్యశాఖను ఉన్నతంగా తీర్చిదిద్ది సీఎం కలను నెరవేర్చారని తెలిపారు. నిజామాబాద్‌లో ఉన్న 9 అసెంబ్లీ స్థానాల్లో అన్నిచోట్లా బీఆర్ఎస్ పార్టే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ సంజయ్ యువకుడు, ఉత్సాహవంతుడు.. డాక్టర్‌గా ఆయనకు మంచి పేరుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. చేతినిండా పని, జేబుల నిండా పైసలున్నా.. కోరుట్ల ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారని అన్నారు. మీ ముందుకు వచ్చిన సంజయ్‌ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజలకు తలలో నాలుకలా ఉంటారని, నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికోసం తపించే వ్యక్తి అని పేర్కొన్నారు. పదేండ్లలో ఆయన చేసిన అభివృద్ధి పనులు ప్రజల కండ్ల ముందు ఉన్నాయని చెప్పారు. ఇతర పార్టీలు చెప్పే మాటలు నమ్మి మోస పోవద్దని, మీ బిడ్డగా మీ ఇంటి ముందుండే రసమయిని మరోసారి గెలిపించాలని కోరారు.