హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో హింస, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను లౌకికవాదులంతా ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న ప్రమాదాన్ని గుర్తించి, బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాటాలు చేయడాన్ని సీపీఎం స్వాగతిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకొన్నదని విమర్శించారు. తెలంగాణలో మతపరమైన విద్వేషాలు, గొడవలు రొచ్చగొట్టే ఎజెండాతో ఆ పార్టీ పనిచేస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చకుండా, తెలుగు రాష్ర్టాలపై సవతితల్లి ప్రేమను చూపిస్తున్నదని, దానిని కప్పి పుచ్చుకొనేందుకు ఏదో ఒక గొడవ సృష్టిస్తున్నదని వివరించారు. రాజకీయ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, వారి ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా బీజేపీ సోషల్ మీడియా పనిచేస్తున్నదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు.