హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్ కూడా ఎగిరిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు లేవు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం లాటరీ, ర్యాండమ్ తదితర అశాస్త్రీయ విధానాల్లో బీసీలకు రిజర్వేషన్లను కలిస్తూ వస్తున్నాయి. దీంతో న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ట్రిపుల్ టీ పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో మొదటిది ప్రతీ స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన, డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలి. రెండోది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడోది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి మొత్తంగా 50% మించకూడదు. ఈ మార్గదర్శకాలు పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానికసంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
అంతేకాకుండా, బీసీ రిజర్వేషన్ స్థానాలన్నింటినీ జనరల్ స్థానాలుగానే మార్చాలని స్పష్టంచేసింది. దీనినిబట్టి డెడికేటెడ్ కమిషన్ నివేదిక లేకుండా స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు ఉండబోవని స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో గత నవంబర్‌లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన గణాంకాలను ప్రామాణికంగా తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆ నివేదికనే రిఫరెన్స్‌గా చూపి ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టింది. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు.
2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా అప్పటి పంచాయతీరాజ్ అధికారులు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% చొప్పున కేటాయించారు. కాంగ్రెస్ నిర్వాకంతో ఇప్పుడు బీసీలకు ఆ రిజర్వేషన్ కూడా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. బూసాని నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసిన 42% రిజర్వేషన్ చెల్లని పరిస్థితి నెలకొన్నది. దీంతో బీసీల రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొన్నది. ప్రస్తుతం గతంలో మాదిరిగానే బీసీలకు 22.79% రిజర్వేషన్లు కల్పించాలన్నా డెడికేటెడ్ కమిషన్ మళ్లీ ఆ మేరకు తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అయితే బూసాని డెడికేటెడ్ కమిషన్ గడువు ఇప్పటికే ముగిసిపోయింది. దీంతో స్థానిక ఎన్నికల్లో బీసీల కోటా ప్రశ్నార్థకం కానున్నది. బీసీలకు కోటా కల్పించాలంటే కొత్తగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి లేదంటే బూసాని వెంకటేశ్వర్లు కమిషన్ గడువునైనా పొడగించాల్సి ఉంటుంది. ఆ కమిషన్ గతంలో మాదిరిగా బీసీలకు రిజర్వేషన్లను సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే బీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కూడా దక్కే అవకాశం ఉండదు.
గుజరాత్లో 4,775 గ్రామ పంచాయతీ స్థానాలు ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, సర్వే గణాంకాల ప్రకారం గుజరాత్లో 52% ఓబీసీ జనాభా ఉన్నది. అయినప్పటికీ 1990 నుంచి ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 10% సీట్లు అంటే 470 మాత్రమే రిజర్వ్ చేస్తూ వస్తున్నారు. 2022లో డెడికేటెడ్ కమిషన్ నివేదిక లేకుండానే ఎన్నికలను నిర్వేహించేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
బీసీలకు కల్పిస్తున్న 10% సీట్లను కూడా జనరల్ స్థానాలుగానే పరిగణించాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రతిపక్షంతోపాటు స్వపక్షంలోని ఓబీసీ నేతలు నిప్పులు చెరగడంతో ఓబీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ ఝవేరి చైర్మన్‌గా ఏకసభ్య కమిషన్‌ను గుజరాత్ ప్రభుత్వం నియమించింది. మహారాష్ట్ర సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ స్థిరీకరణ బాధ్యతను డెడికేటెడ్ కమిషన్‌కు కాకుండా, ఆ రాష్ట్ర ఓబీసీ కమిషన్‌కే అప్పగించింది.
డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. దీంతో మహారాష్ట్ర సర్కారు సైతం అప్పటికప్పుడు ఆ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జయంత్ బాటియా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. తెలంగాణ ప్రభుత్వం సైతం తొలుత డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు. నిరంజన్ చైర్మన్‌గా ఉన్న రాష్ట్ర బీసీ కమిషన్‌కే రిజర్వేషన్ల స్థిరీకరణ బాధ్యతను అప్పగించింది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని రాష్ట్ర బీసీ సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బూసాని నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.