జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణాది రాష్ర్టాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. మరో 25 ఏండ్లు ప్రక్రియను చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో శనివారం చెన్నైలో జరిగిన జేఏసీ తొలిభేటీకి తెలంగాణ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
Delimitation | చెన్నై, మార్చి 22: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం ఏర్పడిన పార్లమెంటరీ నియోజకవర్గాలను కేంద్రం ఇప్పటివరకు స్తంభింపచేసిందని, దీన్నే మరో 25 సంవత్సరాల పాటు పొడిగించాలని శనివారం చెన్నైలో డీఎంకే సారథ్యంలో నిర్వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తమ డిమాండ్లను తెలియచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే ఎంపీలు ఒక సంయుక్త వినతి పత్రాన్ని అందచేయాలని కూడా జేఏసీ నిర్ణయించింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు వివిధ పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యారు.
1971 జనాభా లెక్కల ప్రకారం జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 సంవత్సరాల పాటు కొనసాగించాలని జేఏసీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్య సిద్ధాంతాలను, స్వరూపాన్ని మెరుగుపచేందుకు చేపట్టే ఎటువంటి డీలిమిటేషన్ ప్రక్రియనైనా పారదర్శకంగా, అన్ని రాష్ర్టాలలోని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములతో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే చేపట్టాలని సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో జేఏసీ కేంద్రాన్ని కోరింది.
జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడంతో ఆ తర్వాత జనాభా తగ్గిన రాష్ర్టాలను శిక్షించకూడదని, ఇందుకోసం కేంద్రం అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయాలని విజ్ఞప్తిచేసింది. తమ సూచనలకు విరుద్ధంగా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే దాన్ని తిప్పికొట్టేందుకు సమావేశానికి హాజరైన రాష్ర్టాలకు చెందిన ఎంపీలతో కూడిన కోర్ కమిటీ పార్లమెంటరీ వ్యూహాలను సమన్వయం చేసుకుంటుందని తీర్మానం తెలిపింది.
ప్రస్తుత పార్లమెంటరీ సమావేశాలలో కోర్ కమిటీకి చెందిన ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక వినతిపత్రాన్ని సమర్పిస్తారని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ర్టాలకు చెందిన రాజకీయ పార్టీలు తమ రాష్ట్ర అసెంబ్లీలలో అవసరమైన తీర్మానాలను ఆమోదించడానికి చర్యలు చేపట్టాలని, ఆమోదించిన తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని జేఏసీ తన తీర్మానంలో పేర్కొంది.