హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. స్థానిక సమస్యలే ఎజెండాగా ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఇస్తున్న నిధులు, చేస్తున్న పనులను వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీచేసేవాళ్లు రెండుసార్లు పార్టీ క్రియాశీల సభ్యుడై ఉండాలని తెలిపారు. అయితే ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన ఈటల రాజందర్కు ఈ నిబంధన వర్తించదని స్పష్టంచేశారు. విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం నిధులు ఇస్తున్నదని ఆయన చెప్పారు.