హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ కంకణం కట్టుకొన్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. ఈ వ్యవహారంపై సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా డబ్బు కుమ్మరించి కొనుగోలు చేయవచ్చని బీజేపీ భావిస్తున్నదని నిప్పులు చెరిగారు.
ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ బీజేపీ చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు కలిసొచ్చే వారిని సమీకరించి ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ భావిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి నిరంకుశంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా కార్మిక, ప్రజా సంఘాలు చేపట్టే ఉద్యమాలకు సీపీఎం మద్దతు ఇస్తుందని రాఘవులు పేర్కొన్నారు.