హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పేపర్ లీకేజీల వెనుక బీజేపీ కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. బంగారు తెలంగాణను అధోగతిపాలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయటమే ఆ పార్టీ పనిగా పెట్టుకున్నదని ధ్వజమెత్తారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మాటతప్పిన ప్రధాని మోదీపై లాంగ్‌మార్చ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హితవు పలికారు. పేపర్ లీకేజీలకు పాల్పడినవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని, ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరంలేదని స్పష్టం చేశారు. మంగళవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం లో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, దానం నాగేంద ర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాద వ్ మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ లోఫర్లాగా మాట్లాడుతున్నారని గాదరి కిశోర్ మండిపడ్డారు. ప్రధాని మోదీ ఓసారి 10వ తరగతి చదివానని, మరోసారి మెకానికల్ ఇంజినీర్ అని చెప్పుకొన్నారని, ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? అని అడిగితే తప్పేమిటని నిలదీశారు. ఇందులో వాస్తవాలు ప్రజలకు తెలియాలా? వద్దా? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో తన తండ్రి టీచర్‌గా పనిచేశారని స్వయంగా బండి సంజయ్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రంలో పేపర్ లీకేజీల వెనుక బీజేపీ కుట్ర ఉన్నదని అందరికీ తెలిసిపోయిందని, ఇందుకు బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఎమ్మెల్యే గాదరి కిశోర్ హెచ్చరించారు. లీకేజీలను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో సహించదని, బాధ్యులపట్ల కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టంచేశారు. లీకేజీ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ఆపాదించడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టే ఉంటుందని అన్నారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే బండి సంజయ్ నోరును ప్రజలే చీరేస్తారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పులి బిడ్డలని.. బీజేపీ బెదిరింపులకు వారు భయపడరని తేల్చిచెప్పారు. బీజేపీ బ్రోకర్, జోకర్, పాగల్ గాళ్ల పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు.
దేశం దుస్థితిని మార్చాలన్న విషయంలో సీఎం కేసీఆర్‌కు ఉన్న దార్శనికత, రాజనీతిజ్ఞత మరెవరికీ లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. భారతీయ ఝూటా పార్టీగా ఉన్న బీజేపీకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ప్రభుత్వాలను కూల్చటం తప్ప ప్రజాస్వామ్య విలువలు తెలియవని ఎద్దేశా చేశారు. దేశాన్ని బాగుచేసేందుకు స్పష్టమైన రూట్‌మ్యాప్‌తో సీఎం కేసీఆర్ ఉన్నారని, ఈ విషయంలో బీజేపీ మేధావులు ఎవరైనా వచ్చి కేసీఆర్‌తో చర్చించవచ్చని సవాల్ విసిరారు. ఏ అంశం మీదైనా బీజేపీ మేధావులు కేసీఆర్‌తో చర్చకు రావ్చని, కేసీఆర్ వాదనలో తప్పున్నదని గుండెల మీద చేయ్యేసుకొని చెప్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. బండి సంజయ్‌కి పిచ్చి కుక కరిచినట్టున్నదని ఎద్దేవా చేశారు. శవాల మీద పేలాలు ఏరుకునే రీతిలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ మతం, కులం పేరుతో రాజకీయ చేయటం తప్ప ప్రజలకు మేలు చేయాలని కలలో కూడా ఊహించదని విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ మరోసారి నోరుపారేసుకొంటే ఊరుకొనే ప్రసక్తేలేదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పుట్టగానే బీజేపీ వెన్నులో వణుకు మొదలైందని, అందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మొదలు కేంద్రమంత్రులు తెలంగాణకు క్యూ కట్టారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మోదీ ఇప్పటికీ స్పందించకపోవటం దారుణమని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బీజేపీ ఎజెండా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే కుట్రతోనే బీజేపీ నాయకులు పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారు. 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని గ్రహించలేకపోవడం దారుణం. పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యహరిస్తున్నది. తాండూరు, వరంగల్ పదో తరగతి పేపర్ లీకేజీకి కారకులైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాం. ఉపాధ్యాయులు రాజకీయ నేతల ఉచ్చులో పడి విద్యార్థుల జీవితాలను నాశనం చేయొద్దు.
– సబిత, విద్యాశాఖ మంత్రి
రాజకీయ లబ్ధి కోసమే పేపర్ లీకేజీల దుర్మార్గానికి బీజేపీ ఒడిగట్టింది. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయాలనుకునే బీజేపీని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఏడాదిపాటు కష్టపడి చదివి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను చూసి తల్లిదండ్రులు సంతోషపడే వాతావరణాన్ని బీజేపీ చెడగొట్టింది.
– తలసాని శ్రీనివాస్‌యాదవ్, మంత్రి