హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్ జరపాలని ఇక్కడి నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత డిమాండ్ చేశారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పలు చోట్ల ఎంఐఎం నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. చాంద్రాయణగుట్టలోని రియాసత్‌నగర్‌లో కార్పొరేటర్ ఇంట్లో పోలింగ్ బూత్ (నం. 40) పెట్టారని చెప్పారు. ఆ భవనంలో పైన కార్పొరేటర్ ఇల్లు ఉన్నదని అన్నారు. సాయంత్రం తలుపులు మూసేసి ఓట్లు రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. దాదాపు 45 నిమిషాల రిగ్గింగ్ తర్వాత లోపల ఉన్న నేతలు బయటికి వెళ్లిపోతుంటే తాను వీడియో తీశానని చెప్పారు. మరోచోట 16 ఏండ్ల అమ్మాయితో రెండు ఓట్లు వేయించారని ఆరోపించారు. బహుదూర్‌పూర నియోజకవర్గంలో ఒకే వ్యక్తి ఓటు వేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వీడియో పశ్చిమ బెంగాల్‌కు చెందినదని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.