హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కృష్ణాజలాల నిర్వహణను కేఆర్ఎంబీకి ఎందుకు అప్పగించడంలేదో చెప్పాలని బీజేపీ సభ్యుడు మహేశ్వర్‌రెడ్డి కోరారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పునర్విభజన చట్టం వల్లనే నదీజలాల పంపిణీలో రాష్ర్టానికి అన్యా యం జరిగిందని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటూ, రాష్ట్రం కోరిన విధంగా కృష్ణాజలాలను కేటాయిస్తే వెంటనే కేఆర్ఎంబీకి అప్పగిస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఏడేండ్ల సమయం తీసుకున్నదని చెప్పారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ, అం తర్జాతీయ జలవివాదాల చట్టంతోపాటు నదీ పరివాహక ప్రాంతాల ప్రకారం కృష్ణాజలాల్లో తెలంగాణకు 68.5శాతం, ఏపీకి 31.5శాతం రావాల్సివుందని చెప్పారు. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు జో క్యం చేసుకొంటూ.. ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, సభ్యులు ద్రవ్య వినమయబిల్లుపైనే మాట్లాడాలని కోరారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేయాలని బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి కోరారు.