నిజామాబాద్ : మతపిచ్చితో, అప్రజాస్వామిక విధానాలతో, అధికార దురంహకారంతో, లంచగొండి వ్యవహారాలతో, కుంభకోణాలతో, ఎన్పీఏలతో లక్షల కోట్లు దోచిపెట్టిన ఈ దుర్మార్గమైన బీజేపీని ఇంటికి సాగనంపాలి. కచ్చితంగా బీజేపీ ముక్త్ భారత్ జెండా ఎగురవేసి ఈ దేశాన్ని బాగు చేద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఈ బీజేపీ ఎవర్నీ ఉద్దరించలేదు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క రంగానికి మంచి పని చేయలేదు. ఎవర్నీ ఉద్దరించలేదు. బలహీనవర్గాలను పట్టించుకోలేదు. అంతర్జాతీయంగా పరువుపోయే పనులు చేస్తున్నారు. ప్రతిపక్షాలను చీల్చుతూ.. ప్రభుత్వాలను కూలగొడుతూ, ఒక అహంకారంతో, బలుపుతో, మదమెక్కిన విధానంతో గవర్నమెంట్లను పడగొడుతామని మాట్లాడతున్నారు. ఆనాడు నేను ఒక్కడినే. మీరంతా కలిసివ స్తే సముద్రమై ఉప్పొంగి తెలంగాణను సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రైతులను, పేదలను కాపాడుకుంటున్నాం. అందర్నీ అందుకొని ముందుకు పోతున్నాం. ఈ విధంగా దేశం బాగుపడాలి.
ఈ నిజామాబాద్ గడ్డ నుంచే ప్రకటిస్తున్నా..
దేశం బాగుపడాలంటే ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలి. అహంకార రాజకీయాలు ఉండకూడదు. ప్రతిపక్షాలను చీల్చి చెండాడి, ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొనేలా ఉండకూడదు. ప్రజాస్వామ్యంతో, సహనశీల విధానంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే లౌకిక ప్రజాస్వామ్య శక్తుల యొక్కరాజ్యం రావాలి. 28 రాష్ట్రాల రైతులు జాతీయ రాజకీయాల్లోకి రావాలని నన్ను ఆహ్వానించారు. భారతదేశం గురించి పిడికిలి బిగించాలి. మేం అండగా ఉంటామని చెప్పారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు మనందరం పోవాలి. ఈ నిజామాబాద్ గడ్డ నుంచే ప్రకటిస్తున్నా. మనం జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిద్దాం. తెలంగాణను బాగు చేసినట్లే దేశాన్ని బాగు చేద్దాం. అన్ని రంగాల్లో కేంద్రం విఫలమైంది అని కేసీఆర్ పేర్కొన్నారు.