నర్సంపేట, నవంబర్ 30: వైఎస్ షర్మిల వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు ఉన్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. షర్మిలను అడ్డుకొన్న క్షణాల్లోనే బీజేపీ నాయకులు, గవర్నర్ ఆమెకు మద్దతు తెలిపిన తీరుతోనే ఆ విషయం అర్థమవుతన్నదని అన్నారు. బుధవారం సాయంత్రం వరంగల్ జిల్లా నర్సంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. షర్మిల పాదయాత్రలో సీఎం కేసీఆర్‌ను, ఎమ్మెల్యేలను దుర్భాషలాడుతూ విద్వేషాలు సృష్టించడంలో కుట్రలు దాగి ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
షర్మిల దుర్భాషలు గవర్నర్‌కు వినబడటం లేదా? అని ప్రశ్నించారు. ముమ్మాటికీ ఈ బాణం వెనుక బీజేపీ ఉన్నదని ఆరోపించారు. ‘నేను వేల కోట్లు కూడబెట్టానని ఆరోపణలు చేశావు. నా రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రత్యర్థి పార్టీల నాయకులు కూడా నాపై ఆరోపణలు చేయలేదు. నాకు ఆస్తులు ఎక్కడున్నాయో చెప్పాలి’ అని షర్మిలను డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే షర్మిల వేలకోట్ల విలువైన భూములు సంపాదించారని ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా చిట్టాల మండలం నవాబ్‌పేటలో వందల ఎకరాల భూమి బ్రదర్ అనిల్‌కుమార్ బినామీల పేర్లతో సంపాదించారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పూడూరులోనూ వందల ఎకరాల భూములు వారికి ఉన్నాయని విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని షర్మిలకు హితవు చెప్పారు.