రవీంద్రభారతి, జూన్ 21 : 42% బీసీ రిజర్వేషన్ల అమలుకోసం సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బిల్లును ఆమోదింపజేయాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పందించాలని, లేనిపక్షంలో బీసీలు పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వివిధ బీసీ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లును ఆమోదింపజేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీ తమ చిత్తశుద్ధిని ప్రదర్శించాలని కోరారు. బిల్లు ఆమోదం కోసం పంపి మూడు నెలలు గడుస్తున్నా, కేంద్రంలో కదలిక లేదని విమర్శించారు.
ఈ సమయంలో ఏడుసార్లు రాష్ట్ర క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఈ బిల్లును మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కేంద్రంతో పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ బిల్లుపై కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు తీర్పులూ బీసీలకు ప్రతికూలంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.