నిర్మల్, జూన్ 5 : సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసి బీఆర్ఎస్ లో(BRS)కి వలసలు కొనసాగుతున్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. నిర్మల్ జిల్లా మామ డ మండలంలోని పరిమండల్ గ్రామంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రగామిగా నిలిపిన దార్శనిక పాలకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి, దేశానికి శరణ్యమన్నారు. బీఆర్ఎస్ది అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలన, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. శాస్త్రినగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.