మోర్తాడ్, జూన్ 6: రేవంత్ సర్కార్ పాలనలో ఆంధ్రా పాలకుల గద్దల చేతుల్లో తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని ముందుకు పెట్టి చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణను మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగల నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమే అని అన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ శివారులోని లలితాగార్డెన్స్లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వేముల మాట్లాడారు.
యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతులు కేవలం ఒక ఫోన్‌కాల్‌తో యూరియా వారి పొలాల్లోకి చేరేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్ రైతులపాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి విద్యుత్తుశాఖను విభజించి రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్తు సరాఫరాను దెబ్బ తీయాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
లాభాదాయక విభాగాలను ప్రైవేట్‌కు అప్పగించి, వ్యవసాయరంగాన్ని మాత్రమే ప్రభుత్వ పరిధిలో ఉంచే కుట్ర జరు గుతున్నదని, దీని వల్ల భవిష్యత్తులో రైతులకు ఉచిత విద్యుత్తు అందదని హెచ్చరించారు. ధాన్యం, మక్కజొన్న సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేంద్ర ప్రభుత్వ విధానాలను సాకుగా చూపడం సరైంది కాదని తెలిపారు. నిరుడు రూ.1200 ఉన్న డీఏపీ బస్తా ధరను రూ.2150కి పెంచారని, రూ.1400 ఉన్న జీలుగ బస్తా రూ.2400కు పెంచి అదనపు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చేసిన అప్పు రూ.4 లక్షల కోట్లు మాత్రమేనని వేముల వివరించారు. ఆ అప్పుతో కాళేశ్వరం ప్రాజెక్టు, చెక్‌డ్యామ్‌లు, రూ.75వేల కోట్ల రైతుబంధు, మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, 24గంటల ఉచిత విద్యుత్తు ఇలా ఎన్నెన్నో అమలు చేసి సంపదను సృష్టించారని తెలిపారు. కేసీఆర్ అప్పులు చేశారని విమర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో చేసిన అప్పు ఏకంగా రూ.4 లక్షల కోట్లని, ఈ అప్పుతో ఏం సాధించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వ పెద్దల తీరు వల్ల తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ఒక సైనికుడు కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి వీజీగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, హన్మంత్‌షిండే, జాజాల సురేందర్, బాల్కొండ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి దావ వసంత, ఉద్యమకారుడు రాజారాంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.