(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): బీజేపీ-ఆరెస్సెస్ మధ్య సంబంధాలను 2014కు ముందు.. ఆ తర్వాత అని రాజకీయ విశ్లేషకులు విభజిస్తారు. 2014 కంటే ముందు.. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టే కంటే మునుపు ఈ రెండు వ్యవస్థల మధ్య సత్సంబంధాలు ఉండేవి. ఆరెస్సెస్ సూచనల ప్రకారమే బీజేపీలో నిర్ణయాలు జరిగేవి. కానీ ఎప్పుడైతే మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారో పరిస్థితులు మారిపోయాయి. ఆరెస్సెస్ సూచనలను క్రమంగా పక్కనబెడుతూ మోదీ-అమిత్ షా ద్వయం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. అంతేకాకుండా సంఘ్ కీలక నేతలతో చర్చించకుండానే వాటిని అమలు చేయడం వంటివి కూడా జరిగిపోయాయి. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడం, పార్టీలో మోదీ బలమైన నేతగా ఉండటంతో ఆరెస్సెస్ కూడా దశాబ్దకాలంగా మౌనంగానే ఉండిపోయింది. ఒకానొక దశలో ఆరెస్సెస్‌తో బీజేపీకి పనేం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.
‘ప్రారంభంలో మాకు (బీజేపీకి) తక్కువ బలం ఉండేది. చిన్న శక్తిగా ఉండే వాళ్లం. అలాంటి సమయంలో ఆరెస్సెస్ అవసరం మాకు తప్పనిసరిగా మారింది. అప్పుడు ఆరెస్సెస్‌పై ఆధారపడే పరిస్థితి. అయితే నేడు మేం ఎదిగాం. సొంత బలం, సామర్థ్యం సాధించాం. బీజేపీ తన కార్యకలాపాలను తానే సొంతంగా నడుపుకొనే స్థాయికి చేరింది. ఇదే అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా. ఆరెస్సెస్ అనేది ఒక సాంస్కృతిక, సామాజిక, సైద్ధాంతిక సంస్థ. మా వరకూ మేము (బీజేపీ) ఒక రాజకీయ పార్టీ. అలాంటప్పుడు ప్రతీ పార్టీకి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. అటు ఆరెస్సెస్, ఇటు బీజేపీ.. ఎవరి పని వాళ్లు చేసుకొంటున్నాం’ అని నడ్డా పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
అయితే, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి పెద్ద ఝలక్ ఇచ్చాయి. మిత్రపక్షాల మద్దతు లేకుండా అధికారంలోకి రాని పరిస్థితి ఆ పార్టీకి ఎదురైంది. ప్రధానిగా మోదీకి ఇది ఊహించని షాక్. పైగా 2014, 2019 నాటితో పోలిస్తే, ప్రజల్లో మోదీ ఛరిష్మా అంతకంతకూ తగ్గిపోయిందని పలు సర్వే రిపోర్టుల్లో తేలింది. దీన్ని ధ్రువపరుస్తూ.. 2014-2024 వరకూ ఏదో ఓ కార్యక్రమం పేరిట మూడు రోజులకొకసారి మీడియాలో కనిపించే మోదీ.. 2024 లోక్‌సభ ఫలితాల తర్వాత ముఖం చాటేసే పరిస్థితికి వచ్చారని, ఈ పరిణామాలను లోతుగా గమనిస్తున్న ఆరెస్సెస్ వెంటనే అలర్టయ్యిందని విశ్లేషకులు చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో సంఘ్‌కు కొత్త ఆయుధం దొరికినట్టయిందని, ఆ తర్వాత కూడా మోదీ తరచూ పాలనలో తప్పిదాలు చేస్తుండటం, పాలనపై క్రమంగా పట్టు కోల్పోతుండటం మరింతగా కలిసి వచ్చిందని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే గతవారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. 75 ఏండ్లకు రిటైర్మెంట్ కావాలంటూ పరోక్షంగా మోదీని టార్గెట్ చేశారని అభిప్రాయపడుతున్నారు.
అధ్యక్షుడి ఎంపికలోనూ
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకొనే బీజేపీలో గడిచిన 45 ఏండ్లలో ఎన్నడూ చూడని పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది. గడిచిన రెండున్నరేండ్లుగా ఆ పార్టీ అధ్యక్ష పదవి ఒకవిధంగా ఖాళీగానే ఉన్నది. పొడిగింపుల పేరిట నడ్డాను బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. బీజేపీ చరిత్రలో అధ్యక్ష పీఠం ఇలా ఇంతకాలం ఖాళీగా ఉండటం ఎన్నడూ చూడలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడి ఎంపికలో బీజేపీకి, ఆరెస్సెస్‌కు మధ్య అభిప్రాయ భేదాలు నెలకొనడమే దీనికి కారణంగా చెప్తున్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్లను ఈ నెల ప్రారంభంలో ఆమోద ముద్ర కోసం ఆరెస్సెస్ నాయకత్వానికి పంపించినట్టు బీజేపీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే వీరిద్దరిలో ఎవరి పేరును కూడా ఆరెస్సెస్ ఆమోదించలేదు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. మోదీని ముందు పెట్టి 2029 ఎన్నికల్లో బీజేపీ గెలవడం కష్టమని ఆరెస్సెస్ నేతలు భావిస్తున్నట్టు వినికిడి.
దీంతో మోదీ-షా వర్గానికి చెందిన ప్రధాన్, భూపేందర్‌ను అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే బీజేపీ ప్రక్షాళనకు ఎలాంటి అవకాశం ఉండదని, మోదీదే మళ్లీ పైచేయిగా సాగుతుందనీ, ఈ కారణంగానే వ్యక్తిగతంగా కాకుండా పార్టీని సంస్థాగతంగా బలపరిచే నేతను అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని ఆరెస్సెస్ తలపోస్తున్నట్టు ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. ఇక, ఈ ఏడాది సెప్టెంబర్ 17కు మోదీకి 75 సంవత్సరాల వయసు నిండుతుంది. 75 ఏండ్లకు క్రియాశీల పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధన అనధికారికంగా బీజేపీలో ఉన్నది. భాగవత్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ తన పదవి నుంచి దిగిపోవాలని కొందరు ఆరెస్సెస్ నేతలు సూచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మోదీ-షా పిడికిలి నుంచి బీజేపీని విడిపించగల అధ్యక్షుడిని సంఘ్ కోరుకుంటున్నదని, భవిష్యత్తులో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించ గల తర్వాతి తరం నాయకులను ప్రోత్సహించాలని సంఘ్ భావిస్తున్నదని ఆరెస్సెస్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
రాష్ర్టాల్లోనూ బలమైన ముద్ర
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికలోనే కాదు.. రాష్ర్టాల అధ్యక్షుల ఎంపికలోనూ ఆరెస్సెస్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఇటీవల జరిగిన వివిధ రాష్ర్టాల అధ్యక్ష ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. తెలంగాణలో అధ్యక్ష పదవి ఈటల రాజేందర్‌కు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరికి ఆరెస్సెస్ మూలాలు ఉన్న రాంచందర్‌రావును ఎంపిక చేశారు. మోదీ, షా స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ ఈటలకు అధ్యక్ష పదవి దక్కలేదని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఇక పొరుగు రాష్ట్రం ఏపీ అధ్యక్ష ఎన్నిక సమయంలోనూ బీజేపీలో అనేక కొత్త పేర్లు బయటికి వచ్చినా, ఆరెస్సెస్‌తో అనుబంధం ఉన్న పీవీఎన్ మాధవ్‌నే ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన హేమంత్ ఖందేవాల్, మహారాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రవీంద్ర చవాన్, హిమాచల్ ప్రదేశ్ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజీవ్ బిందాల్, అండమాన్ అండ్ నికోబార్‌కు బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్ తివారీకి కూడా ఆరెస్సెస్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో మోదీ-షా ద్వయం ప్రభావాన్ని తగ్గించి పార్టీని ప్రక్షాళన చేయడానికే ఆరెస్సెస్ ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మోదీ పరివారంలో కలవరం
ప్రస్తుతం బీజేపీకి మోదీ అవసరం ఉన్నదని, అయితే మోదీకి బీజేపీ అవసరమేమీ లేదని ఆ పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029లో మోదీని పక్కకు తప్పించి ఎన్నికలకు వెళ్తే బీజేపీకి 150 సీట్లు కూడా రావని అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో వచ్చే 15-20 ఏండ్లూ మోదీ సారథ్యంలోనే బీజేపీ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భాగవత్ రిటైర్మెంట్ వ్యాఖ్యల నేపథ్యంలోనే మోదీ పరివారం ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీని తప్పిస్తే బీజేపీకి నష్టమని దూబే వ్యాఖ్యానించడమే దీనికి రుజువుగా చెప్తున్నారు. కాగా దూబే వ్యాఖ్యలపై సొంతపార్టీలోనే విమర్శలు మొదలయ్యాయి. బీజేపీ లేకపోతే మోదీ ఓ నాయకుడిగా ఎలా ఎదిగే వారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
యూపీలో చర్యలు మొదలు
మోదీ వారసుడిగా పదవిని దక్కించుకునేందుకు తమలో తామే పోటీపడుతున్న అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇరువురి పట్ల కూడా సంఘ్ సంతృప్తిగా లేదని ఆరెస్సెస్ నేత ఒకరు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి బీజేపీకి 62 స్థానాలు దక్కాయి. 2024నాటికి ఈ సీట్లు 33కు పడిపోయాయి. దీంతో యూపీలో పట్టు కోల్పోతున్న బీజేపీ తరఫున ఆరెస్సెస్ రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని 60కి పైగా జిల్లాల్లో ప్రచారక్‌లతో పాటు కోఆర్డినేటర్లను మార్చింది. వచ్చే ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికలు, 2027 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసమే ఈ మార్పులు చేసినట్టు తెలుస్తున్నది. యూపీలో బీజేపీ పట్టు కోల్పోతున్న సమయంలో ఆరెస్సెస్ అరంగేట్రం చేయడం కూడా తన ఉనికిని నిలుపుకోవడానికేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన ఏడాది వ్యవధిలో హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో ఆరెస్సెస్ యాక్టివ్‌గా మారిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
మోదీ రిటైర్మెంట్పై పీఎంవో ఏమన్నదంటే?
‘ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీకి 75 ఏండ్లు నిండుతాయి. ఈ క్రమంలో ఆయన ప్రధానిగా రాజీనామా చేసి బీజేపీ మార్గదర్శక్ మండల్లో చేరుతారా?’ అని సమాచార హక్కు కార్యకర్త (ఆర్టీఐ) అజయ్ బోస్ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)ను ఆర్టీఐ చట్టం కింద ప్రశ్నించారు. దీనికి పీఎంవో సమాధానమిస్తూ.. ఈ ప్రశ్న ఆర్టీఐ పరిధిలోకి రాబోదని, ఇలాంటి ఊహాజనిత విషయాలపై తాము సమాధానం ఇవ్వబోమని తెలిపింది. కాగా, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి అగ్రనేతలకు 75 ఏండ్లు నిండగానే పదవులకు రాజీనామాలు చేయించి.. మార్గదర్శక్ మండల్ పేరిట ఏర్పాటు చేసిన సలహాల కమిటీలో వారిని భాగస్వామ్యం చేయడం తెలిసిందే. ఈ మండల్ ఐడియాను మోదీనే తీసుకురావడం గమనార్హం. కాగా మోదీ రిటైర్మెంట్ గురించి భాగవత్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ రిటైర్మెంట్ గురించి భాగవత్ ఇప్పటికే సిగ్నల్ ఇచ్చారు. దళితుడిని తదుపరి ప్రధానిని చేయడానికి బీజేపీకి ఇదే సువర్ణావకాశం’ అంటూ వ్యాఖ్యానించారు.
బీజేపీకి ఆరెస్సెస్‌తో పనిలేదు
ప్రారంభంలో మాకు (బీజేపీ) తక్కువ బలం ఉండేది. చిన్న శక్తిగా ఉండే వాళ్లం. అలాంటి సమయంలో ఆరెస్సెస్ అవసరం మాకు తప్పనిసరిగా మారింది. అప్పుడు ఆరెస్సెస్‌పై ఆధారపడే పరిస్థితి. అయితే నేడు మేం ఎదిగాం. సొంత బలం, సామర్థ్యం సాధించాం. బీజేపీ తన కార్యకలాపాలను తానే సొంతంగా నడుపుకొనే స్థాయికి చేరింది. ఇదే అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా. ఆరెస్సెస్ అనేది ఒక సాంస్కృతిక, సామాజిక, సైద్ధాంతిక సంస్థ. మా వరకూ మేము (బీజేపీ) ఒక రాజకీయ పార్టీ. అలాంటప్పుడు ప్రతీ పార్టీకి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. అటు ఆరెస్సెస్, ఇటు బీజేపీ.. ఎవరి పని వాళ్లు చేసుకొంటున్నాం.
– బీజేపీ, ఆరెస్సెస్ సంబంధాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు
జేపీ నడ్డా (18.05.2024-లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు) 75 ఏండ్లు నిండితే టికెట్లు ఇవ్వం 75 ఏండ్లు నిండిన వారికి టికెట్లు ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించింది. దీన్ని మీడియా ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నది?
– అద్వానీ, మురళీ మనోహర్ జోషికి టికెట్లు నిరాకరించడంపై అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా (04.04.2019)
75 ఏండ్లు దాటితే దిగిపోవాల్సిందే!
ఒకసారి సంఘ్ సిద్ధాంతకర్త పింగ్లే ఇలా అన్నారు.. ‘మీకు 75 ఏండ్లు వచ్చిన తర్వాత, శాలువా కప్పి సన్మానం చేశారంటే, ఇక దిగిపోవలసిన
సమయం వచ్చింది. మీ వయసు అయిపోయింది. పదవి నుంచి తప్పుకొని, వేరేవాళ్లకు అవకాశం ఇవ్వాలని అర్థం’ అని.
-రిటైర్మెంట్కు సంబంధించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ (09.07.2025)