హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటర్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల పెద్దఎత్తున పంట నష్టం జరిగిందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను కాపాడాలన్న కనీస ఇంకిత జ్ఞానం ముంఖ్యమంత్రికి లేదన్నారు. వేలాది ఎకరాల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరిగిందని, రైతులు నష్ట పోయారని చెప్పారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం సోయి లేకుండా అందాల పోటీల మీద, మూసీ నదిపై రివ్యూలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో చర్చకు రావాల్సిన అనేక సమస్యలు ఉన్నాయని, మూడు రోజులు మాత్రమే సభను నడపాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. సీఎం చర్చలకు భయపడుతున్నారా అని ప్రశ్నించారు. భేషరతుగా 4 వారాలపాటు అసెంబ్లీ నిర్వహించాలని, ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు.