ఖమ్మం, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయనపై పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ సహా అనేక కేసులు నమోదై ఉన్నాయి. అయితే, ఈ ఘటనను టీఆర్ఎస్కు ఆపాదిస్తూ బీజేపీ శ్రేణులు వీరంగానికి దిగాయి. ఖమ్మానికి చెందిన బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మూడు రోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మరణించాడు. దీంతో ఖమ్మంలో బీజేపీ కార్యకర్తలు హడావిడి చేసి ఆందోళనలకు దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించగా పోలీసులు, డాక్టర్లకు సహకరించకుండా అడ్డుకొన్నారు.
దవాఖాన ప్రధాన ద్వారం అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. సాయిగణేశ్ ఆత్మహత్యను సాకుగా చూపి టీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించేసి, దహనం చేశారు. పాత బస్టాండ్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వాహనదారులపైనా దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దౌర్జన్యానికి దిగటంతో కొందరు పోలీసులు కిందపడిపోయారు. సాయిగణేశ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వగానే తీవ్ర ఉద్రిక్తతల మధ్యే కలెక్టరేట్ వద్ద మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు.. బీజేపీ నాయకులతో చర్చలు జరిపి మృతదేహాన్ని వైకుంఠధామానికి తరలించారు.
బీజేపీవి విధ్వంసపూరిత చర్యలు: తాతామధు
టీఆర్ఎస్ను రాజకీయంగా, సైద్ధాంతికంగా ఎదుర్కోలేకే బీజేపీ నాయకులు విధ్వంసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. సాయిగణేశ్ ఆత్మహత్య బాధాకరమన్న ఆయన.. బీజేపీ జిల్లా అధ్యక్షుడే రెచ్చగొట్టి ఆత్మహత్యకు ప్రోత్సహించారని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఆటవిక చర్యలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.