ధర్పల్లి, ఫిబ్రవరి 19: బీజేపీ కార్యకర్తలు మరోసారి గూండాగిరీకి దిగారు. పసుపుబోర్డు ఏర్పాటుపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులపై రాళ్లదాడి చేశారు. కమలం కార్యకర్తల దాడిలో పలువురు రైతు లు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గత నెల 25న ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులపై బీజేపీ నాయకుల దాడులను మరువకముందే మరోసారి నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో అన్నదాతలపై రెచ్చిపోయారు. వివరాలు ఇలా.. గ్రామస్థులు చందాలు వేసుకొని ధర్పల్లిలో శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. విగ్రహ ఆవిష్కరణకు కొందరు బీజేపీ కార్యకర్తలు ఎంపీ అర్వింద్‌ను ఆహ్వానించారు. పార్టీలకతీతంగా చందాలతో విగ్రహాన్ని ఏర్పాటుచేసుకొంటే బీజేపీ ఎంపీని ఎందుకు పిలిచారని సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాలరాజ్తోపాటు గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అయినప్పటికీ అర్వింద్ విగ్రహావిష్కరణకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అర్వింద్ వస్తున్నాడన్న విషయం తెలుసుకొన్న వివిధ గ్రామాల పసుపు రైతులు ఉదయం 9 గంటలకు ధర్పల్లికి చేరుకొన్నారు. ‘పసుపుబోర్డు సంగతేంటి?, బోర్డు తెస్తావా.. రాజీనామా చేస్తావా?’ అంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఉద్రిక్తతలు పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఎంపీ అర్వింద్‌ను ధర్పల్లికి వెళ్లొద్దని పోలీసులు కోరారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేసిన అర్వింద్.. పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలను ధర్పల్లికి రప్పించారు.
అర్వింద్ ఆదేశాలతో రెచ్చిపోయిన శ్రేణులు
ఎంపీ అర్వింద్ ఆదేశాలతో బీజేపీ కార్యకర్తలు కాషాయ కండువాలతో శివాజీ విగ్రహం వద్దకు చేరుకొన్నారు. అక్కడే ఉన్న పసుపు రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేసమయంలో గ్రామస్థులు బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. సర్పంచ్‌నైన తనకు సమాచారం ఇవ్వకుండా ఎంపీ పేరిట విగ్రహావిష్కరణ శిలాఫలకం ఏర్పాటు చేయడమేంటని సర్పంచ్ పెద్దబాలరాజ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్రిక్తతల మధ్యే సర్పంచ్ పెద్దబాలరాజ్, గ్రామ నాయకులు శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో విషయం అర్వింద్‌కు ఫోన్ ద్వారా చేరవేసిన బీజేపీ కార్యకర్తలు.. విగ్రహానికి తిరిగి ముసుగేసి గ్రామస్థులతో ఘర్షణకు దిగారు. బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా రైతులపైకి రాళ్లు విసరడం ప్రారంభించారు.
రైతులు, పోలీసులే లక్ష్యంగా దాడులు
రైతులు, పోలీసులే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు రాళ్లదాడికి తెగబడ్డారు. రైతులతోపాటు ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి కంటికి, తలకు.. సర్పంచ్ పెద్దబాలరాజ్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరినీ హుటాహుటిన దవాఖానకు తరలించారు. ఎస్సై వంశీకృష్ణారెడ్డి కన్ను వద్ద ఏడుకుట్లు పడ్డాయి. రైతుబంధు సమితి మండల కన్వీనర్ పీస్ రాజ్‌పాల్‌రెడ్డి కుడిచేతికి తీవ్రగాయమైంది. రైతు బద్దం నడ్పి గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌యాదవ్ కాళ్లకు గాయాలయ్యాయి. వారికి స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉద్రిక్తత కొనసాగింది. అదనపు బలగాలతో అక్కడికి చేరుకున్న నిజామాబాద్ ఏసీపీ వినీత్ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాళ్లదాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాళ్లదాడి విషయం తెలుసుకొన్న ఎంపీ అర్వింద్ ధర్పల్లి రాకుండానే మార్గమధ్యం నుంచి నిజామాబాద్‌కు వెనుదిరిగారు.