హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుంటూ అవినీతిమయంగా మారిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. జవాబుదారీతనం, పారదర్శకత లోపించిందని, ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన సాగిస్తున్నదని ధ్వజమెత్తారు.
40 శాతం ఎక్కువతో మేఘా కృష్ణారెడ్డికి రూ.4 వేల కోట్ల విలువైన పనులను అప్పగించారని, వీటిని రద్దు చేసి గ్లోబల్ టెండర్లు పిలిస్తే 30 శాతం తకువకే పనులు చేపట్టేందుకు అనేక కంపెనీలు ముందుకొస్తాయని, తద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1,200 కోట్లు మిగులుతాయని చెప్పారు. వారం రోజుల్లో పాత టెండర్లను రద్దుచేసి గ్లోబల్ టెండర్లు పిలవాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
గతంలో మేఘా కృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసి ఆయనను జైలు పంపిస్తానని చెప్పిన రేవంత్రెడ్డి తిరిగి ఆయనకే 40 శాతం ఎకువతో టెండర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్ర అమృత్ పథకం నిధులకు సంబంధించిన పనులను గ్లోబల్ టెండర్లు లేకుండా ఇచ్చారని, ఇందులో రూ.1200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతిని బయటపెట్టి ప్రజాక్షేత్రంలో నిలబెడతామని హెచ్చరించారు. ఈ అవినీతి టెండర్లు రద్దు చేసి గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఖజానాను దోస్తున్న వారు సీఎం దోస్తులా? రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన గుత్తేదారులా? అని నిలదీశారు. సమాధానం చెప్పకుంటే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వారం రోజుల్లో టెండర్లు క్యాన్సిల్ చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టుకు కూడా గ్లోబల్ టెండర్ వేయాల్సిందేనని స్పష్టంచేశారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మహేశ్వర్రెడ్డి విమర్శించారు.