హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బయో ఏషియా 21వ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో జరగనున్నది. ఈవై భాగస్వామ్యంతో నిర్వహించనున్న ఈ సదస్సు షెడ్యూల్‌ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో విడుదల చేశారు. ‘డాటా అండ్ ఏఐ: రీడిఫైనింగ్ పాజిబిలిటీస్’ అనే థీమ్‌తో నిర్వహించనున్న ఈ సదస్సులో 50కిపైగా దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు, విధాన నిర్ణేతలు పాల్గొననున్నారు.
కొత్త ఆలోచనలు, భాగస్వామ్యాలకు వేదికగా నిలిచే బయో ఏషియా సదస్సు.. నూతన శకానికి నాంది పలుకుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టెక్నాలజీ, బయాలజీ, డాటా సైన్స్, లైఫ్‌సైన్సెస్ రంగాలకు హైదరాబాద్ ప్రధాన కూడలిగా భాసిల్లుతున్నదని, జీవశాస్ర్తాల రంగం పురోభివృద్ధికి ఇక్కడి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. డాటా, ఏఐ, లైఫ్‌సైన్సెస్ రంగాల పరస్పర సమన్వయానికి బయో ఏషియా సదస్సు సరైన వేదికని పేర్కొన్నారు. కార్యక్రమంలో లైఫ్ సైన్సెస్, బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు.