Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఓవైపు రాష్ట్ర ఆదాయం పడిపోతుండటం.. మరోవైపు ఎన్ని అప్పులు తెచ్చినా ఇచ్చిన హామీలు నెరవేరే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అ ధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పాలన కుంటుపడుతున్నదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల సమయంలోనే 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రకటనలు చేసిం ది. కానీ, వీటిలో కనీసం ఒక్క శాతం కూడా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినా.. ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి కింద ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపునకే రేవంత్సర్కారు పరిమితమైంది. వీటి అమలుకే నిధులు లేవ ని, మిగతావి అమలు చేయడం కష్టమని ఆర్థికశాఖ వర్గాలు చేతులెత్తేసినట్టు తెలిసింది. ఆర్థికంగా భారమయ్యే నిర్ణయాలను మరో 4 నెలల వరకు అమలు చేయొద్దని ప్రభుత్వ పెద్ద ల నుంచి ఆదేశాలు వచ్చినట్టు వినికిడి. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఫైళ్లు ఆగిపోయినట్టు చెప్తున్నారు. మరోవైపు కాంట్రాక్టర్లకు జనవరి వరకు బిల్లులు నిలిపివేయాలని, ‘ప్రాధాన్య’ క్రమంలో మాత్రమే బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఈ ఏడాది జూలైలో రాష్ర్టానికి పన్నుల రూపేణా వచ్చే ఆదాయం రూ.9,965 కోట్లకు మించకపోవచ్చని రేవంత్‌రెడ్డి సర్కారు కాగ్‌కు నివేదించింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 4 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.23 వేల కోట్ల అప్పులు చేసింది. ఓవైపు ఆదాయం తగ్గుతుండటం, మరోవైపు అప్పులు పెరుగుతుండటంతో వచ్చే 5 నెలల వరకూ ఏ కొత్త పథకాన్నీ నెత్తికెత్తుకోవద్దని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. అందుకే ఫైళ్లను పక్కన పడేసి, సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మూసీ సుందరీకరణ పేరుతో గత కొన్ని నెలలు చేసిన హడావుడి ఇప్పుడెందుకు లేదని జనం ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా పేరుతో అభిప్రాయ సేకరణ జరిపినా ఎటూ తేల్చలేదని, ఇందిరమ్మ ఇండ్లు ప్రకటనలకే పరిమితమయ్యాయని, రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ లోగో మార్పు.. ఇలా అనేక ఫైళ్లు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని మండిపడుతున్నారు. పింఛన్ల పెంపు ఊసేలేదని, మెట్రో ప్రతిపాదనలకు మోక్షం లేదని, ఉద్యోగులకు పెండింగ్ డీఏ అందని ద్రాక్షగా మారిందని మండిపతుతున్నారు. ‘ఫిబ్రవరిలో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాం. కానీ, మీకు ఉద్యోగాలు ఇస్తే వెంటనే ప్రతి నెల జీతం ఇవ్వాల్సి వస్తుంది. కొన్నాళ్లపాటు ఆగండి’ అని ఓ మంత్రి డీఎస్సీ-2008 అభ్యర్థులతో చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వం కనీసం 1,500 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో లేదని ఎద్దేవా చేస్తున్నారు.
కాంట్రాక్టర్లకు సంక్రాంతి వరకు బిల్లుల చెల్లింపులు నిలిపివేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. కానీ, వాటిని పూర్తిగా ఆపేయకుండా కాంగ్రెస్ వర్గీయులకు, ఇతర అస్మదీయులకు మాత్రమే బిల్లులు మంజూరు చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ‘ప్రాధాన్యత’ ప్రకారమే బిల్లులు మంజూరు చేస్తామని ఇటీవల ఓ మంత్రి బహిరంగంగానే చెప్పారు. రూ.లక్షల్లో ఉన్న బిల్లులకు ఉన్నతాధికారుల నుంచి, రూ.కోట్లలో ఉన్న బిల్లులకు మంత్రి స్థాయి నేతల నుంచి సిఫారసులు ఉంటే తప్ప చెల్లింపులు జరపొద్దని ఆ మంత్రి స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ఈ విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వ పెద్దలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీకి కొత్త చీఫ్ నియామకం అంటూ నెలలపాటు ఢిల్లీ చుట్టూ తిరగడం, హైడ్రా పేరుతో రాష్ర్టాన్ని ఆగమాగం చేయడం లాంటివన్నీ డైవర్షన్ రాజకీయాల్లో భాగమేనన్న చర్చ జోరుగా సాగుతున్నది.