హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గురునానక్, శ్రీనిధి వర్సిటీల బిల్లులకు గతంలోనే అసెంబ్లీలో ఆమోదం లభించింది. దీంతో ఆయా వర్సిటీలు విద్యార్థుల అడ్మిషన్లు తీసుకున్నాయి. అయితే, ఈ బిల్లులకు గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, తమకు న్యాయం చేయాలని విద్యార్థులు శనివారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
దీనికి స్పందించిన మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రితో ఈ అంశంపై సమీక్షించారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని, వారి సమస్యను పరిష్కరించేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వారం పదిరోజుల్లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.