ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 : రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హర్షవర్ధన్ అనే వ్యక్తికి ఇంటినెంబర్ కేటాయించే విషయంలో బిల్‌కలెక్టర్ నరేష్ పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయటంతో విధిలేని పరిస్థితిలో బాధితుడు హర్షవర్ధన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం హర్షవర్ధన్ నుంచి రూ.20వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పట్టుబడిన బిల్‌కలెక్టర్ నరేష్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి కావటంతో ఈయన వెనుక ఎవరిపాత్ర ఉందనే దానిపై మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తుర్కయంజాల్‌కు చెందిన హర్షవర్ధన్ ఇంటినిర్మాణం చేపట్టాడు. ఇంటికి నెంబర్ కేటాయింపు విషయమై పలుమార్లు కార్యాలయంచుట్టూ తిరిగినప్పటికి అధికారులు స్పందించలేదు.
లంచం ఇస్తేనే నెంబర్ కేటాయించటం జరుగుతుందని తెలియజేయటంతో విసుగుచెందిన బాధితుడు హర్షవర్ధన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుని నుంచి రూ.20వేల లంచం తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన బిల్‌కలెక్టర్ నరేష్‌ను విచారణ అనంతరం అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.