న్యూఢిల్లీ, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): బీహార్ ఎన్నికల్లో ఫండింగ్ బాధ్యతను తెలంగాణకే అప్పగించారా? రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్‌తో భేటీ అయింది అందుకేనా? ఈ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరించారా? తెలంగాణ నుంచి మంత్రివర్గం అంతా ఢిల్లీ వచ్చింది ఇందుకేనా? 42% బీసీ రిజర్వేషన్ల మీద న్యాయసలహా అనేది వారి ఢిల్లీ ప్రయాణానికి కప్పిన ముసుగా? అంటే ఢిల్లీలో జరిగిన ప్రతి పరిణామం ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నది. తెలంగాణ మంత్రివర్గం సోమవారం పోలోమని గంపగుత్తగా ఢిల్లీకి చేరడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్టు, ఇది బీసీ మంత్రులకు తెలియకుండా జరిగిపోయినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై సీనియర్ న్యాయ నిపుణుల బృందం సలహా తీసుకొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, కొంతమంది మంత్రులు ఢిల్లీ వెళ్తున్నట్టు సీఎంవో లీకులు ఇచ్చింది. బీసీ మంత్రులు కూడా ఇదే చెప్పారు. న్యాయ నిపుణుడు, తెలంగాణ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ కానున్నట్టు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు విధించిన గడువు దగ్గరకొస్తున్నది.
ఈ నేపథ్యంలో అసలు స్థానిక ఎన్నికలకు వెళ్లాలా? బిల్లు పెండింగ్‌లో ఉన్న అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? అనే అంశం మీద అభిషేక్ సింఘ్వీ నుంచి న్యాయ సలహాలు తీసుకుంటామని మంత్రులు చెప్పారు. అయితే, ఢిల్లీ నగరానికి వెళ్లిన తరువాత కొందరు మంత్రులు మాత్రమే ఎంపీ అభిషేక్ సింఘ్వీని కలిశారు. వారు ఈ సందర్భంగా 30 నిమిషాలపాటు మాట్లాడారు. కానీ, ఈ భేటీలో ముఖ్యమంత్రి పాల్గొనలేదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్వంలో నడిపించారు. అనంతరం రాష్ట్ర బీసీ మంత్రులు ఎవరి వసతిగృహాలకు వారు పరిమితమయ్యారు.
బీసీ మంత్రులు సింఘ్వీని కలిసి మాట్లాడే పనిలో ఉంటే.. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ప్రత్యేకంగా సమావేశం అయినట్టు తెలిసింది. మధ్యలో డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన భట్టి విక్రమార్క కూడా వచ్చి జత కలిసినట్టు సమాచారం. ముగ్గురు కలిసి నేరుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైనట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఉన్నదని కూడా ముందే మీడియాకు లీకులు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల మీద పార్టీపరంగా ముందకువెళ్లాలా? ప్రభుత్వంపరంగా ముందు కు పోవాలా? అనే అంశాన్ని చర్చిస్తామనే కలరింగ్ ఇచ్చారు. కానీ, సమావేశంలో ఈ నలుగురు నేతలే కాకుండా.. బీసీ అంశంతో ఏమాత్రం సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ జాతీయ ట్రెజరర్, బీహార్ ఎన్నికలకు పార్టీ పరంగా ఫండింగ్ బాధ్యతలు చూస్తున్న అజయ్ మాకెన్ పాల్గొన్నట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. పూర్తిగా తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ల అంశం మీద పార్టీ జాతీయ కమిటీ ట్రెజరర్‌కు ఏం పని? అని ఢిల్లీ జర్నలిస్టు వర్గాలు ఆరా తీయగా… అసలు మర్మం బయటికి వచ్చినట్టు తెలిసింది.
‘బీసీ రిజర్వేషన్లపై న్యాయ సలహా’ పేరుతో సాగిన ఢిల్లీ టూర్లో.. బీహార్ రాష్ర్టానికి తెలంగాణ నుంచి ఏ మేరకు ఫండింగ్ చేయాలి? వాటిని ఎలా పంపాలి? ఎవరికి అందజేయాలి? అనే అంశం మీదనే ప్రధానంగా చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడ పార్టీ ఎన్నికల ఖర్చులో కొంత భాగాన్ని సమకూర్చే బాధ్యతను ఢిల్లీ అధిష్ఠానం తెలంగాణ నేతలకు అప్పగించినట్టు తెలసింది. అధిష్ఠానం ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన మంత్రులు సోమవారం ఢిల్లీ వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బీహార్ ఎన్నికల్లో భారీ ఎత్తున ఖర్చు ఉంటుందని, ఇందులో 60% ఖర్చుల బాధ్యతను తెలంగాణ నేతలే తీసుకోవాలని ఏఐసీసీ నేత ఆదేశించినట్టు సమాచారం.
గత ఏడాది హర్యానా ఎన్నికల్లో తెలంగాణ కంట్రిబ్యూషన్ ఉంటుందని ఆశించినప్పటికీ, ఎటువంటి సహాయం అందలేదని, అప్పట్లో హైదరాబాద్‌లో ఈడీ దాడులు జరిగినట్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఏఐసీసీ నాయకుడు గుర్తుచేసినట్టు తెలిసింది. హర్యానాకు ఎన్నికల కోసం అనుకున్న దానికి మరికొంత కలిపి బీహార్ కోసం పంపాలని, లావాదేవీలను పార్టీ ట్రెజరర్ చూసుకుంటారని, ఆయనతో టచ్‌లో ఉండాలని సూచించినట్టు తెలిసింది. హర్యానా ఎన్నికల కోసం తెలంగాణ నుంచి ఎంత ఇస్తామని ఒప్పుకున్నారు? ఇప్పుడు అదనంగా ఎంత కలిపి ఇవ్వమన్నారు? అనే లెక్కల మీద స్పష్టత లేదు.