హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడాలేని విధంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించిన సీఎం కేసీఆర్ను దేశం యావత్తు సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నది. ఆయనేం చేసినా అనితరసాధ్యంగానే ఉంటదని వేనోళ్ల పొగుడుతున్నది. ఆయనది ఉక్కు సంకల్పమని ఇదివరకే నిరూపితమైనది. ఏ పనిచేసినా ఔరా అనిపించేలా చేయటం ఆయన ప్రత్యేకత. శుక్రవారం హైదరాబాద్ నడిబొడ్డున, హుసేన్సాగర్ తీరాన అంబేద్కర్ మనుమడి సాక్షిగా నిత్యచైతన్య స్ఫూర్తినిచ్చే అంబేద్కర్ అద్భుత మూర్తిని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మరో ప్రత్యేకాకర్షణ కూడా ఉన్నది. అదే అంబేద్కర్ విగ్రహానికి అలంకరించిన భారీ పూలమాల. ఇప్పుడదే అంతటా చర్చనీయాంశంగా మారింది. భారీ క్రేన్సాయంతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి 90 అడుగుల పూలమాలను అలంకరింప చేశారు. ఈ మహాగజమాల తయారీ విశేషాలు తెలుసుకుంటే కేసీఆర్ అంటే ఏమిటో అర్థమవుతుంది. కేసీఆర్ మార్గనిర్దేశనం మేరకు రేయింబవళ్లు కష్టపడి.. అత్యంత సుమనోహరమైన సుమమాలను రూపొందించారు.
సుమా రు ఒకటిన్నర టన్నుల పూలను మాలగా కూర్చటమంటే మాటలు కాదు. 5 అడుగు ల మందంతో దాన్ని తీర్చిదిద్దటం ఆషామా షీ కాదు.. కేవలం ఈ పూలమాల తయారు చేయటానికే 90 అడుగుల షెడ్ ను స్మృతివనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మాల అల్లటానికి తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 30 మంది కార్మికులను రప్పించారు. సుమారు 36 గంటల పాటు వారు ఈ భారీ మాలను తయారు చేశారు. ఒకటిన్నర రోజు పాటు పూలు వాడిపోకుండా ఉండేందుకు షెడ్లో ఏసీలను ఉపయోగించారు. కేవలం పూల కోసమే రూ.8 లక్షలు ఖర్చు పెట్టారు. తెల్లచామంతి, గులాబీలు, తమలపాకులతో మాలను తయారు చేశారు. పూలమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించటంతో పాటు తయారీదారులను ప్రత్యేకంగా అభినందించారు. విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేసిన నాటి నుంచి ఆవిష్కరణ దాకా సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలోనే పనులన్నీ సాగాయి. పూలమాల తయారీపై కూడా ప్రత్యేక శ్రద్ధచూపటం కేసీఆర్ పనితనానికి నిదర్శనంగా నిలిచిపోయింది. శిఖరసమానమైన అంబేద్కర్ మహనీయుని భారీ విగ్రహం ముందు అంత పెద్ద గజమాలకు కూడా చంద్రునికో నూలుపోగులాగా మారింది. ఒకటిన్నర టన్నుల బరువున్న దిగ్గజమాలను అలంకరించటానికి ఉపయోగించిన క్రేన్ కూడా విశేషమైనదే. ఇంతకంటే పెద్ద క్రేన్ లేదని నిపుణులు తెలియచెప్పారు.