హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. నియోజవర్గ పరిధిలో వందమందికిపైగా ఉన్న రౌడీషీటర్ల జాబితాలో చిన్నశ్రీశైలంయాదవ్ కూడా ఉండటంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్ పీఎస్ పరిధిలో చిన్న శ్రీశైలంయాదవ్తోపాటు ఆయన తమ్ముడు రమేశ్‌యాదవ్‌ను కూడా బైండోవర్ చేశారు. తమ దగ్గర రౌడీలు లేరంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో.. శ్రీశైలంయాదవ్ బైండోవర్‌తో పోలీసులే అధికారికంగా అభ్యర్థి తండ్రే రౌడీషీటర్ అని నిర్ధారించినట్టయ్యింది. ‘శ్రీశైలంయాదవ్లాంటి రౌడీషీటర్లను, పూర్తిగా కరుడుగట్టిన రౌడీలను తన పార్టీలోకి తీసుకున్న ఘనకీర్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి (చంద్రబాబు)ది కాదా?’ అంటూ గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారని, ఇప్పు డు అదే రౌడీషీటర్ కొడుకుకు కాంగ్రెస్ టికెట్ ఎలా ఇచ్చారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.
కొడుకుకు మద్దతుగా రౌడీషీటర్ ప్రచారం
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కరుడుగట్టిన నేరస్థులు, రౌడీషీటర్లు హల్చల్ చేయడం తీవ్రదుమారం రేపింది. ఎన్నికల ప్రక్రియలో రౌడీషీటర్లు జోక్యం చేసుకుంటున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు ప్రస్తుత ఎన్నికల అధికారులకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో చిన్నశ్రీశైలంయాదవ్తోపాటు ఆయన సోదరుడు రౌడీషీటర్లుగా బైండోవరైన నేపథ్యంలో సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రౌడీషీటర్ కొడుకు ఎంపికను నెటిజన్లు ఎండగడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి తన కొడుకు నవీన్‌యాదవ్‌కు మద్దతుగా చిన్న శ్రీశైలంయాదవ్ స్వయంగా ప్రచారం చేస్తుండటంతో రౌడీలకు అధికారమెలా ఇవ్వాలంటూ నియోజకవర్గ ప్రజల్లో చర్చ జరుగుతున్నది.
రౌడీషీటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు బైండోవర్ చేస్తుంటారు. అయితే, జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తండ్రే రౌడీషీటర్ కావడంతో ఆయన నేరుగా రంగంలోకి దిగి.. ‘నవీన్‌కు ఓటేయకపోతే..’ అంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నది. మూడురోజుల క్రితం తన ఇంటికి సమీపంలో ఉండే మార్కెట్‌కు స్థానిక పెద్దలను పిలిపించి కాంగ్రెస్‌లో చేరాలంటూ హుకూం జారీచేయడంతో వారంతా తమకు ఇష్టంలేకపోయినా శ్రీశైలంతో మనకెందుకు గొడవ అనుకుంటూ పార్టీలో చేరినట్టు ఆయన ఇంటి ఏరియాలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
వందమందికిపైగా రౌడీషీటర్లు!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ర్యాలీలు, రోడ్‌షోలు, ఇతరత్రా సమయాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తమయ్యారు. ప్రశాంతంగా పోలింగ్, కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులతోపాటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టిపెట్టిన పోలీసులు నియోజకవర్గంలో ఉన్న రౌడీషీటర్ల కదలికలను అనుక్షణం పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని టోలీచౌక్, గోల్కొండ, జూబ్లీహిల్స్, మధురానగర్, ఫిల్మ్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, సనత్‌నగర్ తదితర ఎనిమిది పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లను ఇప్పటికే బైండోవర్ చేశారు.
అత్యధికంగా బోరబండలో 74 మంది రౌడీషీటర్లు ఉండగా, మిగతా ప్రాంతాల్లో సుమారు ఎనబైమంది వరకు రౌడీషీటర్లు, అనుమానితులు ఉంటారని, ఎన్నికల సమయంలో నేరాలను నియంత్రించడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను అదుపులో ఉంచే కార్యక్రమంలో భాగంగా వారిని బైండోవర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రౌడీషీటర్లందరికీ ప్రవర్తన సరిదిద్దుకోవాలంటూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. న్యాయస్థానంలో హామీపత్రంపై సంతకం చేయిస్తున్నారు. ఒకవేళ బైండోవర్ అయిన తర్వాత ఈ హామీని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రౌడీషీటర్ల నిత్య కార్యకలాపాలు, వారు ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, బహిరంగసభలు, ప్రచారం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? అనే కోణంలో పోలీసుల నిఘా కొనసాగుతుందని ఓ పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు.
కాంగ్రెస్ నేత, మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు.. చిన్న శ్రీశైలంయాదవ్ నేరచరితను స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో శ్రీశైలంయాదవ్ కొడుకుకే టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది. కాంగ్రెస్ నీతిబాహ్యమైన రాజకీయాలకు ఇదే తాజా ఉదాహరణ.
శ్రీశైలంయాదవ్లాంటి రౌడీషీటర్లను, పూర్తిగా కరుడుగట్టిన రౌడీలను తన పార్టీలోకి తీసుకున్న ఘనకీర్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి (చంద్రబాబు)ది కాదా?’
– అసెంబ్లీలో నాటి కాంగ్రెస్ నేత వైఎస్