బిగ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సాగుతున్న ‘గన్ గేమ్.. పేలిన భూ స్కామ్’ చివరి ఘట్టానికి వచ్చేసింది. 16 ఎకరాల్లో మొదలైన దొంగాట.. డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం చుట్టూ తిరిగి, మంత్రి చేతుల్లోకి వెళ్లి, ‘భూమికి భూమి’ ఫైల్ సిద్ధమై, చివరి నిమిషంలో ముఖ్యనేత ఆపివేయగా, బిగ్ బ్రదర్స్ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. కాసుల వేటలో భాగంగా 30 ఫీట్ల రోడ్డును 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డుగా మార్చి, దాన్ని అష్ట వంకరలు తిప్పి అడుగడుగునా కోట్ల రూపాయలు రాల్చేలా వేసిన ‘బిగ్’ స్కెచ్ వరకు మొదటి, రెండో భాగంలో చదివారు కదా. వారికి హెచ్ఎండీఏ పూర్తిగా దాసోహమై సర్వే నంబర్లను మార్చి, వ్యవస్థలను ఏమార్చి, ప్రభుత్వ ఖర్చుతో 100 ఫీట్ల రోడ్డును నిర్మించేందుకు గెజిట్ జారీ చేయడంతో బిగ్బ్రదర్స్కు కాసుల పంట పండిందని తెలిసిందే. ఈ సినిమా అక్కడితో అయిపోలేదు. ఇక్కడే కథ ైక్లెమాక్స్‌కు చేరుకున్నది. మంచిరేవులలోని 114 ఎకరాల దేవాదాయ భూమిని కొట్టేసేందుకు ‘బిగ్’ స్కెచ్ వేశారు. గతంలో హెచ్ఎండీఏ మాదిరిగానే ఇప్పుడు దేవాదాయ శాఖ అధికారులు సైతం వారికి దాసోహమయ్యారు. స్వామివారికి దక్కాల్సిన భూములను పోటీపడి మరీ రాబందులకు అప్పగిస్తూ ‘స్వామిభక్తి’ని చాటుకుంటున్నారు.
స్పెషల్ టాస్క్ బ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): మంచిరేవుల భూములకు సంబంధించి మంత్రి కుమార్తె చేసిన ఆరోపణలపై లోతుగా పరిశీలించగా.. ‘బయటికి బండను చూపిస్తూ, లోపల కొండను కొల్లగొడుతున్న’ బిగ్ బ్రదర్స్ వ్యవహారం, వారికి వంతపాడుతున్న దేవాదాయ శాఖ ఉద్యోగుల బండారం బయటపడింది. బిగ్ బ్రదర్స్ గీసిన ‘వంద ఫీట్ల హెచ్ఎండీఏ రోడ్డు’ స్కెచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కాదని, గుడితోపాటు గుడిలోపలి లింగాన్ని సైతం మింగేసే కుంభకోణమని తేలింది. వంద ఫీట్ల రోడ్డు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 114 ఎకరాల భూముల్లో మొదలవుతుంది. ‘బిగ్’ సినిమా ైక్లెమాక్స్ కూడా అక్కడే మొదలవుతుంది. ఈ ప్రాంతంలో ఎకరా రూ.70-80 కోట్ల విలువ ఉన్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఈ లెక్కన 114 ఎకరాల దేవాదాయ భూముల విలువ దాదాపు రూ.8,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంతటి విలువైన భూములను కాజేసేందుకు బిగ్ బ్రదర్స్ స్కెచ్ వేయగా, దేవాదాయ శాఖ అధికారులు పూర్తిస్తాయిలో సహకరిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయానికి పలు సర్వే నంబర్లలో 144.07 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో గ్రేహౌండ్స్, ఔటర్ రింగురోడ్డుకు కొంత పోగా, 114 ఎకరాల భూమి మిగిలింది. ఈ భూములపై ఎప్పటి నుంచో న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ భూములు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నాయి. శాఖకు చెందిన 43 రిజిస్టర్లోనూ నమోదై ఉన్నాయి. దీని ఆధారంగా జిల్లా కలెక్టర్ ఈ భూములను 22-ఏ నిషేధిత జాబితాలో కూడా పొందుపరిచారు.
ఈ భూములు తమవేనంటూ కొందరు అర్చకులు 2004లో హైకోర్టులో కేసు వేశారు. అప్పటి నుంచి తరచూ దేవాదాయ శాఖ, అర్చకులకు మధ్య వివాదం కొనసాగుతున్నది. పలు సందర్భాల్లో అర్చకులు భూమిని కబ్జా చేస్తున్నారంటూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు అర్చకులపై నాన్‌బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు ఈ భూముల్లో భాగంగా ఉన్న సర్వే నెంబరు 293లో 12.13 ఎకరాలు ఉన్నది. అందులో మంచిరేవుల గ్రామానికి చెందిన సంజీవరెడ్డి కుటుంబం దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నది. వీటిపై దేవాదాయ శాఖ 2018లో ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో కేసు నమోదు చేసింది. ఇలా పలు వివాదాలు నెలకొన్న 114 ఎకరాల దేవాదాయ భూములను కాజేసేందుకు బిగ్ బ్రదర్స్ రంగంలోకి దిగారు. ఒక్కో అడ్డంకిని తొలిగించుకునేలా స్కెచ్ వేశారు. భూములపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి కదా.. ఒకవేళ దేవాదాయ శాఖ గెలిస్తే ఆ 114 ఎకరాలు ప్రభుత్వ పరం అవుతాయి. అలాకాకుండా అర్చకులు గెలిస్తే? రూ.8500 కోట్ల విలువైన భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయి. మరి అక్కడి నుంచి బిగ్ బ్రదర్స్‌కు దక్కాలంటే?.. ఇక్కడే వాళ్లు చక్రం తిప్పారు. అర్చకులపై ఉన్న నాన్‌బెయిలబుల్ కేసులను బూచిగా చూపి వారిని బిగ్ బ్రదర్స్ దారిలోకి తెచ్చుకున్నారని అక్కడి రియల్ ఎస్టేట్ వర్గాల్లో ప్రచారంలో ఉన్నది. కోర్టుల్లో అర్చకులు కేసు గెలిచిన వెంటనే భూములను తమకు కట్టబెట్టేలా ఒప్పందాలు చేసుకున్నారనే టాక్ నడుస్తున్నది.
కోర్టులో అర్చకులు గెలిస్తే భూమి దక్కేలా ఒప్పందం కుదిరింది సరే.. మరి వాళ్లు ఎలా గెలుస్తారు, గెలిపించేది ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయా? ఎవరికోసమో ఎదురుచూస్తే వాళ్లు బిగ్ బ్రదర్స్ ఎందుకు అవుతారు. కోర్టులో కేసులు నిర్వీర్యం చేసేలా మరో స్కెచ్ వేశారు. గతంలో 100 ఫీట్ల రోడ్డు వేసేందుకు హెచ్ఎండీఏ దాసోహమైతే, ఈసారి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు స్వామిభక్తి చాటుకున్నారు. సాధారణంగా ఏదైనా ఒక భూమిపై ఇద్దరు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఏం చేస్తారు? తమకు అనుకూలమైన తీర్పు వచ్చే వరకు ఇద్దరూ పోరాడుతారు.
ఒకవేళ అందులో ఒకరు కేసును ఉపసంహరించుకున్నారంటే ఏమిటి అర్థం? ఇద్దరూ కలిసి మాట్లాడుకొని, ఇరుపక్షాలకు లాభం కలిగేలా ఒక ఒప్పందం చేసుకొని రాజీపడి ఉండాలి. లేదా కేసును ఉపసంహరించుకున్న వ్యక్తి వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఇలాంటివి సహజం. మరి ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య ఇలాంటి ఒప్పందాలు సాధ్యమేనా మంచిరేవులలోని 293 సర్వే నంబర్లో ఉన్న 12.13 ఎకరాల వేణుగోపాలస్వామి ఆలయ భూములను సంజీవరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారంటూ 2018లో దేవాదాయ శాఖ ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. ఆ రైతు కుటుంబం కబ్జా నుంచి భూములను విడిపించాలని కోరింది. అకస్మాత్తుగా 2024 డిసెంబరులో దేవాదాయ శాఖ అధికారులు ట్రిబ్యునల్‌లో కేసును ఉపసంహరించుకున్నారు. అంటే 2018 నుంచి 2024 వరకు అంటే ఆరేండ్ల పాటు ఆ భూములు తమవేనని పోరాడిన అధికారులు అకస్మాత్తుగా వెనక్కి తగ్గారు. అంటే ఇరువర్గాలు రాజీపడ్డాయేమో? అనే అనుమానం కలుగుతున్నది కదా? కానీ కాదు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే.. తాను కబ్జాలో ఉన్నానంటూ కేసు వేసిన దేవాదాయ శాఖ అధికారులు, అకస్మాత్తుగా ఎలా ఉపసంహరించుకుంటారంటూ సంజీవరెడ్డి ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని బట్టి దేవాదాయ శాఖ అధికారులు, సంజీవరెడ్డి రాజీపడలేదని స్పష్టం అవుతున్నది. భూమిపై ఉన్న వివాదాలను ఒక్కొక్కటిగా తొలిగించే క్రమంలోనే దేవాదాయ శాఖ తప్పుకొన్నదని విశ్వసనీయంగా తెలిసింది.
ఇక్కడే మరో ట్విస్ట్ బయటికి వచ్చింది. ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో సంజీవరెడ్డికి వ్యతిరేకంగా వేసిన కేసును 2024 డిసెంబరులో ఉపసంహరించుకున్న దేవాదాయ శాఖ అధికారులు సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ ఆయనపై ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ భూముల్లో అక్రమంగా సాగు చేస్తున్నారంటూ సంజీవరెడ్డి కుటుంబంపై 2025 డిసెంబర్లో నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు ఆ కుటుంబానికి చెందిన పలువురు సభ్యులను ఒక రోజంతా స్టేషన్లోనే ఉంచినట్టు తెలిసింది. ఇలా ఎందుకు చేశారని ఆరా తీయగా.. ఆ భూమిపై ‘ఇటు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో కేసు ఉండొద్దు, అటు సంజీవరెడ్డి కబ్జాలో ఉండొద్దు’ అనేది దేవాదాయ శాఖ అధికారుల ఆంతర్యంగా తేలింది. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ మరింత లోతుగా విచారణ చేయగా, హైకోర్టులో అర్చకుల కేసును కొలిక్కి తీసుసురావడంలో భాగంగా అడ్డుగా ఉన్న కేసులను ఒక్కొక్కటిగా క్లియర్ చేయాలనేది బ్రదర్స్ వ్యూహంగా తెలిసింది. ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లోని కేసు ఉపసంహరణ సమయంలోనూ పెద్ద డ్రామా జరిగినట్టు బయటపడింది. వాస్తవానికి దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌లో కేసు ఉపసంహరించుకోవాలంటే సెక్షన్-89 ప్రకారం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీ సమగ్రంగా చర్చించి ఇచ్చిన సిఫారసుల ఆధారంగానే కేసు ఉపసంహరణ జరగాలి. కానీ అదేమీలేకుండా కేవలం ఈవో ఇచ్చిన లెటర్ ఆధారంగా దేవాదాయ శాఖ కమిషనర్ కేసు ఉపసంహరణకు ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 2024 డిసెంబర్లో కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను చూసి ట్రిబ్యునల్‌లోని న్యాయమూర్తులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. 2025 జనవరి 10న కేసు డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అంటే దేవాదాయ శాఖ అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం వెనుక ‘పెద్ద’ కారణం ఉన్నదనే చర్చ జరుగుతున్నది.
114 ఎకరాలను కాజేయాలనుకున్న బిగ్ బ్రదర్స్‌కు ఈ కేసు మరో అడ్డంకిగా మారింది. ఇక్కడే తమకు అనుకూలమైన అధికారులతో చక్రం తిప్పారు. 2024 డిసెంబరులో ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో కేసు ఉపసంహరించుకున్న సమయంలోనే దేవాదాయ శాఖ అధికారులు ఈ కేసుపైనా దృష్టి సారించారు. హరితహారం కార్యక్రమం ఎలాగూ కొనసాగడంలేదని, ఈ క్రమంలో ఆ భూముల్లో తాము చెట్లు నాటే అవకాశం లేనందున గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాల్సిందిగా కోర్టును కోరారు. దీంతో స్టేను హైకోర్టు ఎత్తివేసింది. అంటే బిగ్ బ్రదర్స్‌కు అడ్డుగా ఉన్న రెండు కేసులనూ దేవాదాయ శాఖ అధికారులు వెనక్కి తీసుకున్నారన్నమాట. ఈ చర్య ఫలితంగా హెచ్ఎండీఏ ద్వారా తెరపైకి తెచ్చిన వంద ఫీట్ల రహదారి భూసేకరణ నోటిఫికేషన్‌కు కూడా మార్గాన్ని సుగమం చేసింది. రైతు సంజీవరెడ్డి హైకోర్టు నుంచి తెచ్చుకున్న స్టే ఉత్తర్వులు అమలులో ఉండగానే హెచ్ఎండీఏ అధికారులు వంద ఫీట్ల రహదారి భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియను ముగించగా ప్రభుత్వం గెజిట్‌ను జారీ చేసింది.
ఈ 114 ఎకరాల దేవాదాయ భూముల్లో భారీ ఎత్తున హరితహారం చేపట్టడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విశాలమైన ఈ భూముల్లో పెద్దఎత్తున చెట్లను నాటాలని 2016లో ప్రభుత్వం ఆదేశించడంతో దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. కానీ అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూములు తమవేనంటూ 2004లో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, అయినా ప్రభుత్వం ఏకపక్షంగా హరితహారం చేపడుతున్నందున స్టే ఇవ్వాలని కోరారు. దీంతో అప్పట్లో హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
‘ఒక గోడ కడుతున్నట్టు.. గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు… శ్రద్ధగా! పద్ధతిగా!!’ అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా. అచ్చం ఇలాగే మంచిరేవుల శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 114 ఎకరాల దేవాదాయ శాఖ భూములను కొల్లగొట్టేందుకు బిగ్ బ్రదర్స్ సుమారు రెండు సంవత్సరాలుగా
అంచెలంచెలుగా పావులు కదుపుతున్నారు. ఒక్కో చిక్కుముడిని విప్పుకొంటూ వస్తున్నారు. అందులో భాగంగా మొదట 30 ఫీట్ల రోడ్డుకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి ప్రతిపాదించిన ‘భూమికి భూమి’ ఫైల్‌ను అటకెక్కించారు.
ఆ తర్వాత హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఖర్చుతో ఆ భూమి నుంచి వంద ఫీట్ల రోడ్డు వేయించారు. చివరి ఘట్టంలో దేవాదాయ శాఖ తరఫున నమోదైన ఒక్కో కేసును ఉపసంహరించుకునేలా చేశారు. ఇక మిగిలిందల్లా… హైకోర్టులో అర్చకులు వేసిన కేసు. దీనిని కూడా దేవాదాయ శాఖ ఉపసంహరించుకునేలా చేస్తారని ఈ డీల్ గురించి మొదటి నుంచీ తెలిసిన ఒక బడా బిల్డర్ పేర్కొన్నారు. ఈ భూములకు తమదైన ైస్టెల్లో శుభం కార్డు వేసేందుకు బిగ్‌బ్రదర్స్ రెండుమూడు రకాల ైక్లెమాక్స్లు పెట్టుకున్నారట! ఒకవేళ అర్చకులకు అనుకూలంగా తీర్పు వస్తే.. తెర వెనుక మంతనాలతో అర్చకులను ఇప్పటికే దారిలోకి తెచ్చుకున్నారు కాబట్టి భూములను దక్కించుకుంటారని చెప్తున్నారు. లేదా దేవాదాయ శాఖ నుంచి అర్చకులకు ఎన్వోసీలు ఇప్పించి ఆ భూమిని తమ సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే అంతర్గతంగా పావులు కదులుతున్నాయని సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాదనలన్నీ అమలుకాకపోతే చివరి ఆప్షన్‌గా నామమాత్రపు ఫీజుతో ఏకంగా 99 ఏండ్ల లీజు తీసుకునేలా కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కమీషన్లు, వాటాలు, 114 ఎకరాల భూములు కలగలిపి రూ.9వేల కోట్లకుపైగా కొల్లగొట్టేందుకు వేసిన ఈ స్కెచ్‌కు రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ బిగ్ బ్రదర్సే అని చెప్తున్నారు. మొత్తంగా ‘అధికారం అండగా ఉంటే వెంట్రుకతో కూడా కొండను లాగడం సులభం’ అని బిగ్‌బ్రదర్స్ ఈ మంచిరేవుల కథతో రుజువు చేశారు.
ఇప్పటికైనా దేవాదాయ శాఖ మేల్కొంటే 114 ఎకరాల భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకోవచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే.. వంకర టింకర్లుగా తిరుగుతూ కాసులు రాల్చిన 100 ఫీట్ల రోడ్డును రద్దు చేసి ప్రజాధనాన్ని కాపాడవచ్చు. కానీ.. అవన్నీ జరుగుతాయా? అనేదే పెద్ద ప్రశ్న.
ఎందుకంటే అక్కడున్నది బిగ్‌బ్రదర్స్! వారి వెనుక ఉన్నది ముఖ్యనేత!