కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 20: ప్రొటోకాల్ పాటించే విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల విషయంలో పక్షపాతం చూపొద్దని నిబంధనలు పేర్కొంటున్నా రాష్ట్రంలో అధికారులు, పోలీసుల వైఖరిలో మార్పు రావడం లేదు. మొన్నటికి మొన్న కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ శాసనసభ్యుడు కౌశిక్‌రెడ్డి మధ్య వివాదం విషయంలో చూపిన పక్షపాత వైఖరిపై పోలీసులు విమర్శలు ఎదుర్కొనగా.. తాజాగా మండల రెవెన్యూ అధికారులు అదే వైఖరిని అవలంబించారు.
కూకట్పల్లి మండలంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ వివాదాస్పదమైంది. కూకట్పల్లి మండల పరిధిలో ఇటు శేరిలింగంపల్లి, అటు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. లబ్ధిదారులకు గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, మండల అధికారులు ఒకరోజు ముందుగానే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఆహ్వానం పంపించారు.
మండల కార్యాలయంలోనే చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కూకట్‌పల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తానని, అందుకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కృష్ణారావు అధికారులను కోరారు. అలా కుదరదని, మండల ఆఫీస్‌లో నిర్వహించే వేదికపైనే ఇవ్వాలని తేల్చిచెప్పారు. దీంతో మండల కార్యాలయంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై తన నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
అరికెపూడి ఇంటి వద్దనే పంపిణీ
మరోవైపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చెక్కులను తన ఇంటి వద్దకే తీసుకురావాలని హుకుం జారీ చేయగానే మండల అధికారులు చెక్కులతో ఆయన ఇంటికి పరుగెత్తారు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీని ఆయన ఇంటి వద్దనే ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయించారు. అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలలో ఎమ్మెల్యేలందరికీ ఒకే విధమైన ప్రొటోకాల్ పాటించాల్సిన అధికారులు ఇలా ఒక ఎమ్మెల్యే విషయంలో ఒకవిధంగా.. మరొకరి విషయంలో వేరేవిధంగా ప్రొటోకాల్ పాటించడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కూకట్పల్లి తాసీల్దార్ స్వామిని వివరణ కోరగా..ఎమ్మెల్యే గాంధీ ఇంటివద్ద అధికారులతో కలిసే లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారని, కొన్ని చెప్పలేని ఇబ్బందులు ఉన్నాయని అంటూ సమాధానం దాటవేశారు.