యాదాద్రి భువనగిరి : హక్కుల సాధన కోనం పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) ఆందోళనబాట పట్టారు. జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం, పెండింగ్లో ఉన్న 3 నెలల జీతం వెంటనే చెల్లిం చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మె(Indefinite strike) చేపట్టారు. దీంతో భువనగిరి జిల్లా హాస్పిటల్లో (Bhuvanagiri District Hospital) పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయాయి. జీవో నెంబర్ 60 ప్రకార వేతనాలు చెల్లించడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ అందరికి వర్తింప చేయాలని ఏఐటీయూసీ (AITUC)ఆధ్వర్యంలో శానిటేషన్, సెక్యూరిటీ గాడ్స్ కార్మికులు విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2022 జూన్ నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన కొత్త వేతనాలను ఆసుపత్రి కార్మికులు అందుకుంటున్నారని కానీ భువన గిరి జిల్లా ఆసుపత్రిలో మాత్రం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేసి ఇవ్వని వారికి వెంటనే ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేసి 3 షిఫ్ట్ లు వెంటనే అమలు చేయాలన్నారు. సంవత్సర కాలంగా తక్కువ ఇచ్చిన వేతనం వెంటనే చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.